
అసంపూర్తి గృహాలకు అదనపు ఆర్థిక సహాయం
– జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్
రాయచోటి : 2019–24 మధ్య కాలంలో బీసీ,ఎస్సీ,ఎస్టీలకు మంజూరైన గృహాలు పూర్తి కాకుండా అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేయడానికి అదనంగా ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిందని సోమవారం అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ చెప్పారు. స్వర్ణాంధ్ర–2047 విజన్ సాకారంలో భాగంగా 2029 నాటికి అందరికీ ఇల్లు ఏర్పరచాలనే దృఢ నిశ్చయంతో అసంపూర్తి ఇళ్ల నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో దాదాపు 25 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల గృహాల వివిధ దశల్లో నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. నిర్మాణం పూర్తికి ఎస్సీలు, బీసీలు అందరికీ రూ. 50 వేలు, ఎస్టీలకు రూ.75వేలు చొప్పున అదనంగా ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. లబ్దిదారులు ఇల్లు పూర్తి చేసుకోవడానికి తక్షణణే అవసరమైన చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పీడీ శివయ్యను కలెక్టర్ ఆదేశించారు.
దరఖాస్తుల ఆహ్వానం
ఓబులవారిపల్లె : ఉమ్మడి కడప జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఆంజనేయరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి గురుకులంలో 6,7,8వ తరగతులకు సంబంధించి ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు ఎపీఆర్‌ఎస్‌టీఏటీ– 2025 ద్వారా ప్రవేశ పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు.ఉమ్మడి జిల్లాలోని బాలురకు ముక్కవారిపల్లి గురుకుల పాఠశాలలో, బాలికలకు మైలవరం గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తికల వారు ఏపీఆర్‌ఎస్.సీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 31 వరకు గడువు ఉందన్నారు. ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్షను ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాలకు 8712625056 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
యువతకు శిక్షణ
కడప కోటిరెడ్డిసర్కిల్ (వైఎస్సార్ జిల్లా): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో డీడీయూ–జీకేవై పథకం ద్వారా సి–డ్యాప్ సౌజన్యంతో 18–32 సంవత్సరాల మధ్య వయస్సుగల యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిహార్ స్కిల్ ఎడ్యుకేషన్ రీజినల్ కో ఆర్డినేటర్ ఎం.సుబ్బరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు నెలల కాల వ్యవధిలో ఎలక్ట్రానిక్ కంప్యూటర్ హార్డ్‌వేర్, హెల్త్‌కేర్, ఎమెర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్, ఐటీ సెక్టార్, జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, బ్యూటీ వెల్‌నెస్ సెక్టార్, బ్యూటీ థెరఫీ కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఇతర వివరాలకు 90630 82227 నంబబర్‌లో సంప్రదించాలన్నారు.
ఎస్‌ఎస్‌ఏలో
నూతన నియామకం
కడప కోటిరెడ్డి సర్కిల్ : అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులలో కెరీర్ మానసిక ఆరోగ్య కౌన్సెలర్‌గా కడప నగరానికి చెందిన డాక్టర్ సుష్మితారెడ్డిని నియమించారు. ఈ మేరకు సోమవారం ఆమెకు అధికారికంగా ఉత్తర్వులు అందాయి. ఈ సందర్భంగా డాక్టర్ సుష్మితారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సరైన కెరీర్ మార్గదర్శకత్వం, మానసిక ఆరోగ్య సలహాలు అందించడం ద్వారా వారి భవిష్యత్‌ను మెరుగుపరిచేందుకు తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు.
వైభవం..పల్లకీ ఉత్సవం
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేతుడికి పల్లకీ సేవ నిర్వహించారు.సోమవారం ప్రధాన అర్చకులు శంకరయ్యస్వామి, కృష్ణయ్య స్వామి, రాచరాయయోగీ స్వామి, శేఖర్ స్వామిల ఆధ్వర్యంలో మూల విరాట్‌లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు.అనంతరం ఉత్సవమూర్తులకు రంగురంగుల పూలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. ఆలయమాఢవీధులోల ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో డీవీ రమణారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

అసంపూర్తి గృహాలకు అదనపు ఆర్థిక సహాయం

అసంపూర్తి గృహాలకు అదనపు ఆర్థిక సహాయం
Comments
Please login to add a commentAdd a comment