
వీఆర్వో అక్రమాలపై బాధితుల గగ్గోలు
గాలివీడు : అవినీతి వీఆర్వో బాగోతం తవ్వేకొద్దీ అక్రమాలు కోకొల్లలుగా బయటకు వస్తున్నాయి. ‘వీఆర్వో రూటే సప‘రేటు’శీర్షికతో ఆదివారం సాక్షిలో వెలువడిన కథనంతో సోమవారం బాధితులు మూకుమ్మడిగా రెవెన్యూ కార్యాలయం వద్దకు చేరుకుని తహసీల్దార్ ముందు వీఆర్వో రవీంద్రారెడ్డి చేసిన అవినీతి అక్రమాలపై గగ్గోలు పెట్టుకున్నారు. బాధితులు కొండ్రెడ్డి చిన్న రెడ్డన్న తన అనుభవంలో ఉన్న సర్వే నంబర్ 900బీ1లో 40 సెంట్ల భూమి ఇతరుల పేరుపై ఆన్లైన్ చేయించారని, అలాగే దాదినేని నారాయణ పట్టా భూమి సర్వే నంబర్ 2343/4, 2344/4, 2344/6 లలో మొత్తం 75 సెంట్ల భూమిని సదరు వీఆర్వో మామూళ్లకు ఆశపడి వేరొకరి పేరుపై ఆన్‌లైన్ చేయించాడని వాపోయారు. ఇలా చాలామంది బాధితులు తహసీల్దార్ భాగ్యలత ముందు తమ గోడును వినిపించగా వారి స్టేట్‌మెంట్‌ను రాతపూర్వకంగా రికార్డు చేశారు. వీఆర్వోపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపుతామని, ఉన్నతాధికారులకు నివేదిక పంపుతానని తహసీల్దార్ తెలిపారు. ఇదిలా ఉండగా వీఆర్వో అర్హులకు న్యాయం చేయకుండా ముడుపులు తీసుకుని అనర్హులకు మేలు చేస్తున్నాడని కొందరు వాపోతున్నారు.
వీఆర్వో బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, మండల స్థాయి అధికారులను ప్రభావితం చేస్తుండటంతో చాలామంది స్వేచ్ఛగా ముందుకొచ్చి వారికి జరిగిన అన్యాయాన్ని చెప్పుకోలేకపోతున్నారు. జిల్లా స్థాయి అధికారులు స్పందించి.. క్షేత్రస్థాయిలో పర్యటించి వీఆర్వో అక్రమాలపై విచారణ చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.
‘సాక్షి’కథనంతో విచారణ చేపట్టిన తహసీల్దార్
Comments
Please login to add a commentAdd a comment