హలీమ్‌కు సలాం
రాజంపేట టౌన్ : రంజాన్ మాసంలో చేపట్టే వంటకాల్లో హలీం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఒకప్పుడు హైదరాబాద్‌లోనే దొరికే హలీం ఇప్పుడు ప్రధాన పట్టణాల్లోని ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రంజాన్ మాసం సందర్భంగా ఉపవాసం ఉండే ముస్లీంలే కాక ఇతర మతాల వారు హలీం రుచిని ఎంతో ప్రీతిగా ఆస్వాదిస్తారు. అందువల్ల ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలు అయితే చాలు అనేక మంది ప్రజలు హలీం విక్రయించే చోట వాలిపోతున్నారు.
హలీం అరబ్ దేశానికి చెందిన వంటకం
హలీం అరబ్ దేశానికి చెందిన వంటకమని ముస్లీంలు చెబుతున్నారు. ఆరో నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ హయాంలో అరబ్ దేశమైన పర్షియా నుంచి హలీం తెలుగు రాష్ట్రమైన హైదరాబాద్‌కు చేరుకొని ఎంతో ప్రసిద్ధిగాంచింది. మహబూబ్ అలీఖాన్ తన సంస్థానంలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పర్షియా నుంచి ప్రత్యేక ఆహ్వానితులు వచ్చారు. ఆ సమయంలో రంజాన్ ఉపవాస దీక్షల్లో ఇఫ్తార్‌కు తయారు చేసే ప్రత్యేక వంటకమైన హలీం గురించి ప్రస్తావించారు. వెంటనే నవాబు తన సిబ్బందిని పిలిపించి హలీంను తయారు చేయించారు. ఆ విధంగా హలీం తొలుత హైదరాబాద్‌కు పరిచయమై ఇప్పుడు అన్ని పట్టణాలకు చేరుకుని ప్రజలతో లొట్టలేయిస్తోంది.
తయారీ కూడా ప్రత్యేకమే
సాంప్రదాయ వంటలతో పోలిస్తే హలీం తయారీ చాలా ప్రత్యేకమైనది. హలీం తయారీకి కనీసం తొమ్మిది గంటల సమయం పడుతుంది. ఇందులో మటన్ లేదా చికెన్, గోధుములు, అన్ని పప్పుదినుసులు, బాస్మతిబియ్యం, నెయ్యి, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, యాలకలు, దాల్చిన చెక్క, మిరియాలు, కొత్తిమీర, నూనె, డ్రైఫ్రూట్స్ తదితర వస్తువులను వినియోగించి తయారు చేసి ఇఫ్తార్ సమయానికి సిద్ధం చేస్తారు. ఉపవాసం ముగించుకున్న ముస్లీంలతో పాటు ఇతర మతాలకు చెందిన వారు సైతం హలీంను ఆరగించేందుకు ఇష్టపడతారు. అక్కడే తినేవారికి పింగాణి కప్పులలో వేయిస్తుండగా పార్శిల్ తీసుకెళ్లే వారికి బాక్సులలో వేయిస్తున్నారు. ఒక్కో బాక్సు రూ.150, రూ.250, రూ.500కు విక్రయిస్తున్నారు.
రంజాన్ ప్రత్యేక వంటకంగా గుర్తింపు
రుచికి ఫిదా అవుతున్న జనం
Comments
Please login to add a commentAdd a comment