క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి
రాయచోటి : విధి నిర్వహణలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా, క్రమశిక్షణ, నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తూ బాధితులకు న్యాయం చేసి ముద్దాయిలకు శిక్షలు పడేలా పనిచేయాలని ప్రొబేషనరీ మహిళా ఎస్‌ఐలకు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. అనంతపురం పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం అన్నమయ్య జిల్లాకు కేటాయించిన నలుగురు మహిళా ప్రొబేషనరీ ఎస్‌ఐలు గురువారం జిల్లా కార్యాలయంలో జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా పోలీస్ శాఖలోకి అడుగుపెడుతున్న ప్రొబేషనరీ ఎస్‌ఐలకు ఎస్పీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రజలకు మంచి సేవలు అందిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా విధులను నిర్వర్తించాలని సూచించారు. విధి నిర్వహణలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని ఉత్తమ ఫలితాలను రాబట్టాలన్నారు. అలాగే ప్రజలకు మరింత సేవ చేసేలాగా చూడాలన్నారు. ఫిర్యాదుదారులతో సత్ ప్రవర్తనతో ప్రవర్తించాలని తెలిపారు. పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులను అప్‌లోడ్ చేసే విధానం, ఎఫ్‌ఐఆర్, దర్యాప్తుకు సంబంధించిన రికార్డులను రాయడం నేర్చుకోవాలన్నారు. విధి నిర్వహణలో ఎక్కడా ఏ విధమైన అనుమానం వచ్చినా వెంటనే సీనియర్ అధికారులను అడిగి తెలుసుకొని నివృత్తి చేసుకోవాలని ఎస్పీ తెలిపారు.
మహిళా ఎస్‌ఐలు వీరే..
ప్రొబేషనరీ మహిళా ఎస్‌ఐలు దొంతుల తేజశ్విని, బానోతు శ్రీప్రియ, చిత్తూరు సుస్మిత, పోకల హారిక ఉన్నారు.
ప్రొబేషనరీ మహిళా ఎస్‌ఐలకు
జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచన
Comments
Please login to add a commentAdd a comment