పెద్దతిప్పసముద్రం : మండలంలోని పోతుపేట గ్రామ పంచాయతీలో చేయని అభివృద్ది పనులతో పాటు ఇష్టారాజ్యంగా రూ.లక్షల ప్రజాధనం దుర్వినియోగంపై జనవరి 24న సాక్షి పత్రికలో ‘నిధులు నీళ్లపాలు’ అని కథనం వెలువడింది. ఈ నేపథ్యంలో మండలంలో కొత్తగా ఏర్పడిన పోతుపేట గ్రామ పంచాయతీకి మంజూరైన నిధులు, ఏ పనికి ఎంత ఖర్చు పెట్టారో ప్రజా క్షేత్రంలో బహిర్గతం చేయాలని పోతుపేటకు చెందిన ఎస్సీ నాయకుడు కేవీ రమణ ప్రజా ఫిర్యాదుల దినంలో భాగంగా గత నెల 24న జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సమగ్రమైన విచారణ జరపాలని డీపీఓ మస్తాన్‌వలీని కలెక్టర్ ఆదేశించారు. ఈ తరుణంలో గత కొద్ది రోజులుగా డీపీఓ ఆదేశాల మేరకు మదనపల్లె డీఎల్‌పీఓ నాగరాజు, ఇన్‌చార్జి మండల ఈఓఆర్డీ మోహన్ ప్రతాప్‌లు గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులు, ఖర్చుల వివరాలతో కూడుకున్న రికార్డులను తనిఖీ చేస్తున్నారు. ఖర్చు చేసిన రూ.22 లక్షల నిధులకు సంబంధించి పలు అనుమానిత రికార్డులను పరిశీలించి విస్తుపోయినట్లు సమాచారం. రెజ్యులేషన్, క్యాష్, ఎంబుక్‌లు, వార్డు సభ్యుల తీర్మానాలు, వాటి ఆమోద పత్రాలు లేకపోవడాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. అనంతరం రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎల్‌పీఓ విలేకరులతో మాట్లాడుతూ రికార్డులు సంతృప్తికరంగా లేవు. రికార్డుల తనిఖీ ఇంకా కొనసాగుతోంది, క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్ర స్థాయిలో ప్రజల సమక్షంలో విచారిస్తాం. జరిగిన కొన్ని పనులకు సంబంధించి విజిలెన్స్ కమిటీకి అప్పగించి సమగ్రమైన తుది నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. ఈ సందర్బంగా పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసిన కేవీ రమణ మాట్లాడుతూ ఎలాంటి మీటింగ్‌కు వెళ్లని తమ బంధువులైన వార్డు సభ్యుల సంతకాలు కూడా ఫోర్జరీ చేశారని, పనులకు తగ్గ ఎంబుక్‌లు కూడా లేవని, నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన అధికారులకు వత్తాసు పలికినా, అధికార పార్టీ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి రికార్డులు తారుమారు చేసినా తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు.
డీఎల్‌పీఓ నాగరాజు
నిధుల దుర్వినియోగంపై
కొనసాగుతున్న విచారణ
Comments
Please login to add a commentAdd a comment