
స్త్రీల సాధికారతే ధ్యేయం
రాయచోటి: రాష్ట్రంలో మహిళా సాధికారతే లక్ష్యమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాయచోటిలోని నారాయణ ఫంక్షన్ హాల్‌లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి, కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యతల వల్ల రాష్ట్రంలో మహిళా సాధికారత సాధ్యమైందన్నారు. డ్వాక్రా గ్రూపుల వల్ల ఎంతో మంది మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించగలిగారన్నారు. ఈ ఏడాది మే నెల నుంచి తల్లికి వందనం కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 25 వేల లావాదేవీలతో నాణ్యతతో కూడిన వస్తువులను విక్రయం చేసేందుకు సహకరించిన జిల్లా కలెక్టర్‌కు, జిల్లా యంత్రాంగానికి శుభాభినందనలు తెలిపారు.
భవానీని స్పూర్తిగా తీసుకుందాం:కలెక్టర్
జిల్లాలోని మదనపల్లెకు చెందిన భవానీని స్పూర్తిగా తీసుకుని మహిళలందరూ ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. జీడీపీలో జిల్లా 23వ ర్యాంకులో ఉన్నప్పటికీ జిల్లాలోని మహిళలు డిజిటల్ కామర్స్‌లో ఎంతో ముందున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని మహిళలు చేసిన ఉత్పత్తులను విక్రయం చేసి 25 లక్షల రూపాయల విలువతో 25 వేల లావాదేవీలు జరగడం ఇందుకు ఉదాహరణగా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో లక్షాధికారులుగా మారిన మహిళలను సత్కరించుకోవడం ఆనందదాయకమన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నేడు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న 635 ఎస్‌హెచ్‌జీ గ్రూపు మహిళలకు దాదాపు రూ.90 కోట్ల రుణాలను అందిస్తున్నామని తెలిపారు. ఎస్సీ ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు పీఎంఏజేఏవై పథకం కింద 46 మందికి 76 లక్షల రూపాయల రుణాలను అందిస్తుట్లుగా పేర్కొన్నారు. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న 109 మందితో కూడిన ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు 17 కోట్ల రూపాయల రుణాలను అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. మెప్మా ఆధ్వర్యంలో 614 మంది మహిళలకు జాతీయ అప్రెంటిస్ శిక్షణ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నామని ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు నైపుణ్య అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పీఎం విశ్వకర్మ కార్యక్రమం ద్వారా 87 మంది మహిళలకు 86 లక్షల రూపాయల రుణాలను అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ,టైలరింగ్ మిషన్లను అందిస్తున్నామన్నారు.
దేశ ఆర్థిక ప్రగతిలో మహిళల పాత్ర కీలకం: ఎస్పీ
మహిళలు కేవలం కుటుంబపోషణలోనే కాకుండా దేశ ఆర్థికాభివృద్ధికి పాటు పడుతున్నారని వారి భద్రత చాలా ముఖ్యమని ఎస్పీ పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం శక్తి మొబైల్ యాప్‌ను ఈ రోజు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా మహిళలకు ఎటువంటి అభద్రత ఎదురైనా ఒక బటన్ నొక్కితే పోలీసులకు సమాచారం వెళుతుందన్నారు. డ్రోన్లను మహిళా భద్రత కోసం ఉపయోగించడం ప్రారంభించామన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లకు ఒక పోలీసును ఏర్పాటు చేస్తామన్నారు. ఎటువంటి సమాచారమైనా ఆ పోలీస్‌కు తెలుపవచ్చని పేర్కొన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ రోహిణి, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ దీప్తి, జిల్లా ఐసీడీఎస్ అధికారి రమాదేవిలు మాట్లాడుతూ 21వ శతాబ్దంలో మహిళలు అన్ని రంగాలలో ఎంతో ప్రగతి సాధించారన్నారు.
మెమెంటోలు అందజేత
జిల్లాలో వివిధ శాఖలకు చెందిన ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు, లక్షాధికారులుగా మారిన మహిళలకు మంత్రి, జిల్లా అధికారులు మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లక్ష్మీప్రసాద్‌రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రాజు, తంబళ్లపల్లి టీడీపీ నాయకుడు జయచంద్రారెడ్డి, మదనపల్లెకు చెందిన భవానీ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment