
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
కేవీపల్లె : మండలంలోని మహల్ క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సు, పాల వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో శుక్రవారం రాత్రి ఇద్దరు దుర్మరణం చెందిన విషయం విదితమే. ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప కథనం మేరకు వివరాలిలావున్నాయి. చిత్తూరు జిల్లా గుడిపాలకు చెందిన డిల్లీబాబు (33), అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నీలకంఠరావుపేటకు చెందిన టి. వెంకటేష్ (23) ఇద్దరూ పూతలపట్టు తేజస్ పాల డెయిరీ వ్యాన్‌కు డ్రైవర్లుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి పాల వ్యాన్‌తో పీలేరు నుంచి కలకడ వైపు బయలుదేరారు. అయితే మార్గం మధ్యలో మహల్ క్రాస్ వద్ద రాయచోటి నుంచి చైన్నె వెలుతున్న ఆర్టీసీ బస్సు, పాలవ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో డిల్లీబాబు, వెంకటేష్ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అదృశ్యమైన హాస్టల్ విద్యార్థి అప్పగింత
కేవీపల్లె : మండలంలోని గ్యారంపల్లె ఎస్సీ హాస్టల్ నుంచి అదృశ్యమైన విద్యార్థి మదనపల్లెలో ఉండగా గుర్తించి హాస్టల్‌కు అప్పగించారు. వివరాలిలావున్నాయి. గ్యారంపల్లె ఎస్సీ హాస్టల్‌లో ఉంటున్న 8వ తరగతి విద్యార్థి వికాష్ శుక్రవారం హాస్టల్ నుంచి బయటకు వెళ్లి కనబడలేదు. దీంతో ఆందోళన చెందిన హాస్టల్ సిబ్బంది బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. చుట్టూ పక్కల గాలించినా కనబడలేదు. విషయం తెలుసుకున్న సోషియల్ వెల్ఫేర్ డీడీ జయప్రకాష్ శనివారం హాస్టల్‌ను సందర్శించారు. ఇదే సమయంలో మదనపల్లెలో విద్యార్థి ఉన్నట్లు వారి బంధువులు గుర్తించి గ్యారంపల్లెకు తీసుకొచ్చి అప్పగించారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్థం కాకుండా జాగ్రత్తలు పాటించాలని సిబ్బందిని డీడీ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానటరింగ్ కమిటీ సభ్యుడు పాలకుంట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
కారు బోల్తా..చిన్నారి మృతి
రామాపురం : మండల పరిధిలోని 40వ నెంబరు జాతీయ రహదారిలోని పాలన్నగారిపల్లె సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుర్రంకొండకు చెందిన పాలకొండరాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ03 బిజెడ్ 7792 కారులో పాలకొండకు వెళ్లి తిరుగు ప్రయాణంలో మార్గంలోని పాలన్నగారిపల్లె సమీపంలో కారుకు కుక్క అడ్డు రావడంతో తప్పించబోయి కారు బోల్తా కొట్టింది. కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా అందులో చిన్నారి దర్శత్‌సాయి (1) మృతి చెందగా, నాగేష్, మౌనిక, పూజిత, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. క్షత్రగాత్రులను 108లో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటసుధాకర్‌రెడ్డి తెలిపారు.
పెట్రోల్‌తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
కలకడ : పాతకక్షలతో పెట్రోల్ పోసి నిప్పు అంటించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ బి.రామాంజనేయులు తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు .. పిబ్రవరి–7వతేదీన కలకడ మండలం, ఎర్రకోటపల్లె పంచాయతీ గొళ్ళపల్లెకు చెందిన చిన్నరెడ్డెప్ప కుమారుడు సుధాకర్‌పై అదే గ్రామానికి చెందిన చిన్నరెడ్డెప్ప కుమారుడు వేంనారాయణ పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు వేంనారాయణను శనివారం మండలంలోని కోన క్రాస్ వద్ద ఉన్నట్లు గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని వాల్మీకిపురం కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. నిందితున్ని అరెస్ట్ చేసిన వారిలో ఎస్‌ఐ రామాంజనేయులు తోపాటు పోలీసులు హెడ్‌కానిస్టేబుల్ హరిబాబు, రమేష్, పోలీసులు కరుణాకర్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కురబ దేవర ఉత్సవాలు
రామసముద్రం : మండలంలోని మట్లవారిపల్లి గ్రామంలో వెలసిన కురబ దేవర ఉత్సవాలలో భాగంగా శ్రీ ఉజ్జనేశ్వర, శ్రీ సిగరేశ్వర, బీరేశ్వర, భత్తేశ్వరస్వామి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. 13 ఏళ్ల తర్వాత అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు శనివారం గ్రామంలో దేవరెద్దును బ్యాండువాయిద్యాలు, పిల్లనగ్రోవి నడుమ ఇంటింటా తీసుకెళ్లి తొలిపూజలు ప్రారంభించారు. దేవరెద్దుకు ఇంటింటా భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ ఉత్సవాలకు ఆంధ్రా, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి గుడారాలు వేసుకున్నారు. ఆదివారం జరిగే దేవర్ల వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment