ఒంటిమిట్టలో వైభవంగా మహా సంప్రోక్షణ
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం మహా సంప్రోక్షణ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు పొల్గొని పంచసూక్త పవమాన హోమాలు నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు మహాపూర్ణాహుతి, 10.15 నుంచి 11.30 గంటల వరకు వృషభలగ్నంలో మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకం, స్వర్ణపుష్పార్చన జరిగపారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతించారు. కార్యక్రమంలో అర్చకులు, డిప్యూటీ ఈఓలు నటేష్ బాబు, గోవిందరాజన్, సెల్వం, ప్రశాంతి, ఎస్‌ఈలు వెంకటేశ్వర్లు, మనోహర్, వీజీఓ సదాలక్ష్మీ, ప్రెస్ అండ్ సేల్స్ వింగ్ ప్రత్యేక అధికారి రామరాజు పాల్గొన్నారు.
నేడు ప్రజా సమస్యల
పరిష్కార వేదిక
రాయచోటి: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంజిల్లా కేంద్రమైన రాయచోటితో పాటు గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
నేడు ఉచిత గ్రహణమొర్రి పరీక్షలు
రాయచోటి జగదాంబసెంటర్: బసవతారకం స్మైల్ ట్రైన్ సెంటర్–బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ , సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి ఒంటి గంట వరకు ఉచిత గ్రహణ మొర్రి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఐఈ కోఆర్డినేటర్ కె.జనార్ధన తెలిపారు. కడపలోని భవిత సెంటర్‌లో జరిగే శిబిరానికి 6 నెలల వయస్సు నుంచి 50 సంవత్సరాలు వారు హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు.
పులుల గణనకు కెమెరాల ఏర్పాటు
సిద్దవటం: పులుల గణన కోసం సిద్దవటం రేంజ్‌లో 128 కెమెరాలను ఏర్పాటు చేశామని సిద్దవటం రేంజర్ కళావతి తెలిపారు. ఆదివారం రేంజర్ ఇక్కడ మాట్లాడుతూ కడప డీఎఫ్‌ఓ వినీత్‌కుమార్ అదేశాల మేరకు పులుల గణన కోసం సిద్దవటం రేంజ్ లోని 64 స్థానాల్లో ఒక్కో స్థానంలో రెండు కెమెరాల చొప్పున ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మార్చి 5వ తేదీ నుంచి ఆదివారం వరకు వీటిని ఏర్పాటు చేశామన్నారు. 40 రోజుల పాటు కెమెరాల్లోని డేటాను సేకరించనున్నట్లు చెప్పారు. ఈనెల 24న, ఏప్రిల్ 13వ తేదీన డేటాను సేకరిస్తామని రేంజర్ తెలిపారు.
రాయచోటిలో 144 సెక్షన్ అమల్లో ఉంది
రాయచోటి టౌన్: ఈనెల 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాయచోటి టౌన్‌లో 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లు రాయచోటి అర్బన్ సీఐ చంధ్రశేఖర్ ఆదివారం తెలిపారు. ప్రొసీడింగ్స్ అమల్లో ఉంటాయని రాయచోటి తహసీల్దార్ జారీ చేసినట్లు చెప్పారు. దీనిని ఎవరు అతిక్రమించినా చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
మదనపల్లెలో ..
మదనపల్లె: మదనపల్లె డివిజన్‌లో సోమవారం 144 సెక్షన్ అమలులో ఉంటుందని డీఎస్పీ కొండయ్యనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. వీధుల్లో మతపరమైన ర్యాలీలు, సమావేశాలు, ధర్నాలు నిషేధించామన్నారు. ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.
జపాన్ యూనివర్సిటీతో మిట్స్ ఒప్పందం
కురబలకోట: జపాన్‌లోని ప్రముఖ ఐజు యూనివర్సిటీతో అంగళ్లులోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రిన్సిపాల్ యువరాజ్, ఇంటర్నేషనల్ సీనియర్ మేనేజర్ విజయలక్ష్మి తెలిపారు. ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలతో పాటు పరిశోధన, ఆవిష్కరణలకు అవకాశాలు మెరుగుపడతాయన్నారు. విద్యా భాగస్వామ్యం ఏర్పడుతుందన్నారు. ఈ ఒప్పందం అంతర్జాతీయ ప్రయత్నాలో ప్రధాన మైలు రాయి అని విద్యలో సరికొత్త మార్గాలను తెరుస్తుందని కరస్పాండెంట్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి పేర్కొన్నారు.
ఒంటిమిట్టలో వైభవంగా మహా సంప్రోక్షణ
Comments
Please login to add a commentAdd a comment