● అంతర్జాతీయస్థాయిలో సాధించిన మెడల్స్‌ | - | Sakshi
Sakshi News home page

● అంతర్జాతీయస్థాయిలో సాధించిన మెడల్స్‌

Published Mon, Mar 10 2025 10:59 AM | Last Updated on Mon, Mar 10 2025 10:54 AM

● అంతర్జాతీయస్థాయిలో సాధించిన మెడల్స్‌

● అంతర్జాతీయస్థాయిలో సాధించిన మెడల్స్‌

సాక్షి రాయచోటి: రైల్వేకోడూరుకు చెందిన జి. నరేంద్ర, జి. ఉమామహేశ్వరి (బంగారు అంగడి) దంపతుల కుమారుడైన గొబ్బూరు విశ్వతేజ కడపకు చెందిన బ్యాడ్మింటన్‌ అంతర్జాతీయ అంపైర్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ ఎస్‌.జిలానీబాషా శిక్షణలో బ్యాడ్మింటన్‌లో ఓనమాలు ప్రారంభించి అనతికాలంలోనే జాతీయస్థాయిలో రాణించాడు. 2021 నుంచి 2023 వరకు ఒడిశాలోని భువనేశ్వర్‌లో రీజినల్‌ బ్యాడ్మింటన్‌ అకాడ మీలో శిక్షణ పొందాడు. ప్రస్తుతం అస్సాంలోని గౌహతిలో నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో శిక్షణ పొందుతున్నాడు. అంతర్జాతీయస్థాయిలో 3 మెడల్స్‌ సాధించిన ఈయన బ్యాడ్మింటన్‌ ఆఫ్‌ ఇండియా (బాయ్‌) ర్యాంకింగ్‌లో 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా ప్రకటించిన ర్యాకింగ్స్‌లో సీనియర్‌ మెన్స్‌ డబుల్స్‌ విభాగంలో 152వ ర్యాంకు, జూనియర్‌ వరల్డ్‌ బాలుర డబుల్స్‌ విభాగంలో గుంటూరుకు చెందిన భార్గవ్‌రామ్‌తో కలిసి 1వ స్థానంలో ఉన్నాడు. జాతీయస్థాయిలో 17 పతకాలు, అంతర్జాతీయస్థాయిలో 3 పతకాలు సాధించడంతో పాటు పలు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారతజట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. రానున్న రోజుల్లో సీనియర్‌ విభాగంలో సైతం సత్తాచాటేందుకు సన్నద్ధం అవుతున్నాడు.

భారత్‌కు ప్రాతినిథ్యం..

విశ్వతేజ 2024లో చైనాలోని నాన్‌చాంగ్‌లో నిర్వహించిన యోనెక్స్‌ బీడబ్లుఎఫ్‌ వరల్డ్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌, యోనెక్స్‌ బీడబ్లుఎఫ్‌ వరల్‌డ జూనియర్‌ మిక్స్‌డ్‌ టీం చాంపియన్‌షిప్‌లో భారతజట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.

● 2024లో ఇండోనేషియాలోని యోగ్యకర్తాలో నిర్వహించిన బీఎన్‌ఐ బ్యాడ్మింటన్‌ ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించాడు.

● 2023లో చైనాలో నిర్వహించిన బ్యా డ్మింటన్‌ ఆసియా అండర్‌–17, అండర్‌–15 జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించాడు.

సన్మానం: గొబ్బూరి విశ్వతేజ బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ విభాగంలో వరల్డ్‌నెంబర్‌ 1గా నిలిచి జిల్లాకు విచ్చేసిన సందర్భంగా జిల్లా బ్యాడ్మింటన్‌ సంఘం సభ్యులు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. జిల్లా బ్యాడ్మింటన్‌ సంఘం చైర్మన్‌ ఎస్‌. జిలానీబాషా, అధ్యక్షుడు డాక్టర్‌ సింగం భాస్కర్‌రెడ్డి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వి.నాగరాజు, అసోసియేషన్‌ ప్రతినిధులు, సీనియర్‌ క్రీడాకారులు విశ్వతేజను ఘనంగా సన్మానించారు. ప్రపంచ నెంబర్‌ 1 ర్యాంకింగ్‌ సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈయన్ను ఆదర్శంగా తీసుకుని యువ క్రీడాకారులు రాణించాలని ఆకాంక్షించారు.

2025లో ఇస్తోనియాలో నిర్వహించిన యోనెక్స్‌ ఇస్తోనియన్‌ ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లో డబుల్స్‌ మెన్‌ విభాగంలో రజత పతకం సాధించాడు.

2024లో పూణేలో నిర్వహించిన అండర్‌–19 యోనెక్స్‌ సన్‌రైజ్‌ ఆలిండియా జూనియర్‌ ఇంటర్నేషనల్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో డబుల్స్‌ విభాగంలో గోల్డ్‌మెడల్‌ సాధించాడు.

2023లో పూణేలో నిర్వహించిన అండర్‌–19 యోనెక్స్‌ సన్‌రైజ్‌ ఆలిండియా జూనియర్‌ ఇంటర్నేషనల్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌లో డబుల్స్‌ విభాగంలో గోల్డ్‌మెడల్‌ సాధించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement