
కుటుంబ సమస్యలతో కూలీ ఆత్మహత్య
మదనపల్లె : మద్యానికి బానిసై తరచూ కుటుంబ సభ్యులతో గొడవపడుతూ, మనస్థాపం చెంది కూలీ ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం రాత్రి మదనపల్లెలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ఎరగ్రుంట్లపల్లెకు చెందిన సుంకప్ప, విజయలక్ష్మి దంపతుల కుమారుడు ఎస్.రాజు (38), 20 సంవత్సరాల క్రితమే ఉపాధి కోసం మదనపల్లెకు వచ్చాడు. పట్టణంలోని గజ్జలకుంట తిలక్‌వీధిలో నివసిస్తూ నీరుగట్టువారిపల్లె టమాటా మార్కెట్లో కూలీగా పని చేస్తున్నాడు. తల్లిదండ్రులు మృతి చెందడం, భార్య తనని వదిలేసి వెళ్లిపోవడంతో, 10 సంవత్సరాల క్రితం గజ్జలకుంటకు చెందిన దేవితో సహజీవనం చేస్తున్నాడు. ఆమెకు వాణిశ్రీ మౌనిక ఇద్దరు కుమార్తెలు ఉండగా ఆరు నెలల క్రితం వాణిశ్రీకి వివాహం చేశారు. ప్రస్తుతం దేవి మరో కుమార్తెతో కలిసి రాజు ఉంటున్నాడు. కొంతకాలంగా మద్యానికి తీవ్రంగా బానిసై ప్రతిరోజు ఇంట్లో భార్యతో గొడవ పడేవాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగేది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన రాజు భార్య దేవితో గొడవపడి కొట్టాడు. దెబ్బలు తాళలేక ఆమె కుమార్తె మౌనికను తీసుకుని గజ్జల గుంటలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఉదయం తిరిగి ఇంటికి వచ్చి చూడగా తలుపులు కిటికీలు మూసి ఉండడంతో, బయట నుంచి కిటికీ తలుపులు తోసి లోపలికి చూడగా, రాజు ఇంట్లో చీరతో ఉరి వేసుకుని వేలాడుతూ ఉండడాన్ని గమనించి కేకలు వేసింది. దీంతో స్థానికులు టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సమస్యల కారణంగా తీవ్ర మనస్తాపం చెంది ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు, దేవి పోలీసులకు తెలిపారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ రామచంద్ర తెలిపారు.
వేతనాలు పెంచాలంటూ అంగన్‌వాడీల ధర్నా
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం అంగన్‌వాడీ కార్యకర్తలు ధర్నా చేశారు. కార్యకర్తలకు చట్ట ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలన్నారు. కనీస వేతనాలు చెల్లించాలని కోరారు. శాంతియుతంగా ధర్నా చేసేందుకు విజయవాడ వెళుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి జాన్ ప్రసాద్, అధ్యక్షురాలు రమాదేవి, రాధాకుమారి, శిరీషా, లీలావతి పాల్గొన్నారు.
అంగన్‌వాడీల అరెస్టులు దుర్మార్గం
రాజంపేట రూరల్ : విజయవాడలో తలపెట్టిన మహాధర్నాకు బయలు దేరిన అంగన్‌వాడీలను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి ఈ. సికిందర్ పేర్కొన్నారు. స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజమండ్రి, కోనసీమ జిల్లాలలో రిజర్వేషన్ చేసుకొని బస్సు ఎక్కిన అంగన్‌వాడీలను దించివేయడం కూటమి ప్రభుత్వానికి తగదన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు, నరసింహ, జమాల్, రమణ, రవి, రాఘవ, తదితరులు పాల్గొన్నారు.

కుటుంబ సమస్యలతో కూలీ ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment