
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
రాయచోటి : తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా పట్ట పగలు దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 200 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. సోమవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కచ్చిలేట్ వెంకటేశ్వర్లు తిరుపతి జిల్లా అంబేద్కర్ కాలనీ ఆటోనగర్‌లో ఉంటున్నాడని తెలిపారు. ఇతనిపై తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాలో దొంగతనాలకు పాల్పడినట్లు 19 కేసులు నమోదయ్యాయన్నారు. రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2024 అక్టోబర్ 8వ తేదీన దొంగతనానికి పాల్పడిన కేసులో వెంకటేశ్వర్లు నిందితుడిగా ఉన్నాడన్నారు. పోలీసులకు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాయచోటి సీసీఎస్, రైల్వేకోడూరు పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టి ఈనెల 9న అదుపులోకి తీసుకున్నారన్నారు. తాళం వేసిన ఇంటిలో పగటిపూట దొంగతనాలు చేయడం వృత్తిగా అలవర్చుకున్నట్లు తెలిపారు. వెంకటేశ్వర్లుపైన 19 కేసులు నమోదు కాగా అందులో ఒక మర్డర్ కేసు, హత్యాయత్నం కేసు, మిగిలిన 17 దొంగతనం కేసులు నమోదయ్యాయన్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న సమయంలో నిందితుడికి ప్రమాదం జరిగి కుడి కాలుకు సర్జరీ చేసి రాడ్లు వేశారన్నారు. అతని వద్ద నుంచి సుమారు 200 గ్రాముల బంగారం నగదు, ఒకసోని ఏ7 కెమెరాను స్వాధీనం చేసుకున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న నగల విలువ రూ.17.50 లక్షలుగా ఉందన్నారు. నిందితుడు నడవ లేని స్థితిలో చికిత్స పొందుతుండటం వలన 35(3) బీఎన్‌ఎస్ యాక్టు కింద నోటీసు ఇచ్చామన్నారు. ఈ కేసును ఛేదించడంలో రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, సీసీఎస్ సీఐ ఎం.చంద్రశేఖర్, రైల్వేకోడూరు సీఐ హేమసుందర్, సీసీఎస్ ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి, కోడూరు ఎస్‌ఐ నవీన్, సీసీఎస్ కోడూరు పోలీసు సిబ్బందిని అభినందించారు.
సీసీ కెమెరాలతో ప్రయోజనం..
ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల గుర్తింపు, నేరాల పరిశీలనకు సీసీ కెమెరాలు ఏర్పాటుతో చెక్ పెట్టవచ్చని, వీటి ఏర్పాటు వలన అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. మార్కెట్లు, బస్టాండు, రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్, ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, దేవాలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అవసరమన్నారు.
ప్రతి సమస్యకు చట్ట పరిధిలో పరిష్కారం
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదులకు చట్ట పరిధిలో పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చట్ట పరిధిలో బాధితులకు న్యాయం జరిగేలా భరోసా కల్పించాలని, పోలీసులు నిష్పక్షపాతంగా చట్టప్రకారం దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఫోన్ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు.
పట్టపగలే చోరీలకు పాల్పడుతున్న
దొంగ అరెస్టు
200 గ్రాముల బంగారు నగలు,
కెమెరా స్వాధీనం
ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
Comments
Please login to add a commentAdd a comment