కారు కల్వర్టును ఢీకొని దంపతులకు గాయాలు
రామాపురం : కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిలోని బండపల్లె గ్రామం టోల్‌గేటు సమీపంలో సోమవారం కారు కల్వర్టును ఢీ కొనడంతో నాగిరెడ్డి, వనజ దంపతులకు గాయాలైనట్లు మండల ఎస్‌ఐ వెంకటసుధార్‌రెడ్డి తెలిపారు. తిరుపతికి చెందిన నాగిరెడ్డి, వనజలు కడప నుంచి కారులో రాయచోటికి వస్తుండగా మార్గమధ్యంలో బండపల్లి టోల్‌గేట్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొని కాలువలో పడింది. పోలీసు క్షత్రగాత్రులను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ములకలచెరువు : రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం మండల కేంద్రంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు... సత్యసాయి జిల్లా చీకుచెట్టుపల్లెకు చెందిన ఆదినారాయణ పనుల నిమిత్తం ములకలచెరువుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో రోడ్డు దాటుతుండగా మదనపల్లె వైపు నుంచి కదిరికి వెళ్తున్న ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆదినారాయణ(56) సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భార్య ఉత్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పెట్టుబడి సాయాన్ని అందించాలి
రాయచోటి అర్బన్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా రైతులకు ఇస్తామన్న పెట్టుబడి సాయం రూ. 20 వేలు ఎప్పుడిస్తారని ఏపీ రైతు సంఘం నాయకులు ప్రశ్నించారు. ఏపీ రైతుసంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి, కౌలురైతుల సంఘం జిల్లా కార్య దర్శి రమేష్‌బాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ పంటలకు ఽగిట్టుబాటు ధరను కల్పించి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ముదివేడు రిజర్వాయరు నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.రామాంజులు, రైతు సంఘం నాయకులు వేమనారాయణ రెడ్డి, శ్రీనివాసులు, రమణప్ప, రత్నమ్మ, లక్షుమ్మ తదితరులు పాల్గొన్నారు.
కారు కల్వర్టును ఢీకొని దంపతులకు గాయాలు
Comments
Please login to add a commentAdd a comment