● కొన్నేళ్లుగా తిరుగుతున్నా..
అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్‌లోకి ఇలా పాకుకుంటూ వస్తున్న దివ్యాంగుడిని చూస్తే బాధేస్తుంది. మండు వేసవిలో కాళ్లు చేతులతో పాకుతూ... రోడ్డు ఎండలకు కాలుతుండడంతో అలాగే ముందుకు వచ్చి అతి కష్టం మీద కలెక్టరేట్‌లోకి వచ్చిన ఇతని పేరు ఎలిశెట్టి పార్థసారథి. ఊరు జిల్లా కేంద్రంలోని మాసాపేట. ‘నా వయసు 25 సంవత్సరాలు, డిగ్రీలో బీజెడ్‌సీ పట్టా పొందాను. నేను అడిగేది నాకు పెన్షన్ ఇవ్వండి. చదువుకు తగ్గట్టు ఉద్యోగం కల్పించండి... పోయిన కొన్ని సర్టిఫికెట్లు ఇప్పించండి.. ఇలా ఒక్కసారి కాదు చాలాసార్లు వచ్చి కలెక్టర్ కార్యాలయంలో వినతులు ఇస్తూనే ఉన్నాను. ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా ఫలితం మాత్రం దక్కడం లేదు. రెండు కాళ్లు లేవు నడవలేని స్థితిలో దేకుకుంటూ కలెక్టర్ కార్యాలయం వరకు రావాల్సి వస్తోంది.. ఈ స్థితిలో ఇలా కొన్నేళ్లుగా తిరుగుతున్నా అధికారుల నుంచి స్పందన రాకపోవడం, ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం దారుణం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు పార్థసారథి.
Comments
Please login to add a commentAdd a comment