తొలి రోజు ప్రశాంతం
రాయచోటి : అన్నమయ్య జిల్లాలో పదో తరగతి పరీక్షలు మొదటి రోజున ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన పరీక్షలు మధ్యాహ్నం 12.30 వరకు జరిగాయి. జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారు. జిల్లాలో జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 22, 296 మందికి గాను 21,711 మంది హాజరు కాగా.. 530 మంది గైర్హాజరైనట్లు డీఈఓ సుబ్రమణ్యం తెలిపారు. పరీక్షలకు 97.62 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు.
తెలుగుకు బదులుగా హిందీ పేపర్
పదోతరగతి పరీక్షలలో ముగ్గురు విద్యార్థులకు హాల్ టికెట్లు ముద్రణలో తెలుగు సబ్జెక్టుకు బదులు హిందీ సబ్జెక్టు ముద్రణ కావడంతో.. జిల్లాలోని మూడు సెంటర్లలో కొద్దిసేపు హైరానా నెలకొంది. హిందీ ప్రశ్నాపత్రాన్ని అందుకున్న ఆ విద్యార్థులు తొలుత ఆందోళనకు గురయ్యారు. విద్యార్థుల ఆవేదన, హాల్‌టికెట్టు పరిస్థితులను స్థానిక పరీక్ష నిర్వహణ అధికారి జిల్లా విద్యాశాఖ అధికారికి సమాచారం అందించారు. ముద్రణలో పొరపాటు జరిగి ఉంటుందని, వెంటనే వారికి తెలుగు ప్రశ్నాపత్రాన్ని ఇచ్చి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించడంతో.. కొన్ని నిమిషాల వ్యవధిలో సమస్యకు పరిష్కారం లభించింది. ఈ పరిస్థితి జిల్లాలోని మూడు ప్రాంతాలలో నెలకొనడంతో సమస్యకు పరిష్కారం చూపామని డీఈఓ తెలిపారు.
కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు
పదో తరగతి పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టంగా భద్రాతా ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు పోలీసులు పగడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. రాయచోటి టౌన్ నేతాజీ సర్కిల్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి.. డీఈఓ డాక్టర్ కె. సుబ్రమణ్యంతో కలిసి సందర్శించారు. అనంతరం మాసాపేట జిల్లా పరిషత్ హైస్కూల్, లక్కిరెడ్డిపల్లి మోడల్ స్కూల్‌లో జరుగుతున్న పదో తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించారు. కేంద్రాల చుట్టూ ఉన్న పరిసరాలు, పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు.
ప్రారంభమైన పది పరీక్షలు
97.62 శాతం విద్యార్థుల హాజరు
Comments
Please login to add a commentAdd a comment