
ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యం
రాయచోటి: అన్నమయ్య జిల్లాలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా పంచ ప్రాధాన్యాల లక్ష్యాన్ని నిర్దేశించిందని, ఈ మేరకు వివిధ అభివృద్ధి పథకాలను చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ తెలిపారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా నిర్దేశించిన పంచ ప్రాధాన్యాలలో భాగంగా పశువుల నీటి తొట్ల నిర్మాణం చేపట్టడం, లక్ష్యం మేరకు ఫారంపాండ్‌ల నిర్మాణం, పంట కాలువల పూడిక తీత, సాగునీటి చెరువులలో పూడిక తీత, ఉపాధి కూలీలకు సగటు వేతనం రోజుకు కనీసం రూ. 290లు ఉండేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు 2025–26లో మొదటి త్రైమాసికానికి రూ. 266 కోట్ల లక్ష్యంతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు.
రూ. 243.74 కోట్లతో
అభివృద్ధి పనులు పూర్తి......
2024–25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ నిధులు అనుసంధానంతో రూ. 243.74 కోట్లు ఖర్చుతో వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నా యని కలెక్టర్ వివరించారు. వివిధ విభాగాలలో అభివృద్ధి పనులు పూర్తి చేసుకొని ప్రగతిలో రాష్ట్రంలో జిల్లాకు మూడవ స్థానం సాధించామన్నారు.
ఉపాధితో జీవనోపాధి
జిల్లాలో ఉపాధి పథకాన్ని పటిష్టంగా అమలు చేసి జీవనోపాధులను వృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. ఇందులో భాగంగా గత ఏడాది రూ. 308.47 కోట్లు ఉపాధి నిధులను ఖర్చు చేశామన్నారు. ఇందులో 88 లక్షల పనిదినాలు ఉపాధి కల్పించి వేతనాలు కింద దాదాపు రూ. 230 కోట్లు, మెటీరియల్ కాంపోనెంట్ రూ. 78.47 కోట్లు చెల్లించి 95 శాతం ప్రగతి సాధించినట్లు పేర్కొన్నారు.
రూ. 7.95 కోట్లతో నీటి ఎద్దడి
నివారణకు ప్రణాళిక ప్రతిపాదనలు
జిల్లాలో నీటి ఎద్దడి నివారించడానికి రూ. 7.95 కోట్లతో కంటి న్యూజెన్సీ ప్రణాళికను ప్రభుత్వానికి ప్రతిపాదించామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం 116 గ్రామాలలో నీటి సరఫరా జరుగుతోందన్నారు. వేసవి దృష్ట్యా రాబోయే కాలంలో గ్రామాలలో నీటి ఎద్దడి నివారించడానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్‌అండ్‌బీ ద్వారా ఏడీబీ పథకం కింద జిల్లాలో 380 కిలోమీటర్ల మేర ప్రాధాన్యత రోడ్లు ప్రతిపాదించినట్లు తెలిపారు. సమావేశంలో డ్వామా పీడీ వెంకటరత్నం, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ దయాకర్ రెడ్డి పాల్గొన్నారు.
నీటి తొట్లు నిర్మించాలి
సంబేపల్లె: వేసవికాలంలో పశువులకు దాహార్తిని తీర్చేందుకు పల్లెలలో నీటి తొట్లు, ఫారంపాండ్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని నాగిరెడ్డిగారిపల్లె పంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద నీటి నిల్వతొట్లు, ఫారంపాండ్లు నిర్మించేందుకు కలెక్టర్ భూమి పూజ నిర్వహించారు.
స్పందన సమస్యలపై కలెక్టర్ పరిశీలన
కలకడ: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (స్పందన) లో వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్ ఫణికుమార్‌ను కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో కలకడ మండలం పెండ్లిమర్రివాండ్లపల్లె గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య భార్య వై.సుబ్బమ్మ తనకు రావాల్సిన సర్వేనెంబర్ :982–4లోని 0.04సెంట్లు భూమిని అదే గ్రామానికి చెందిన వ్యక్తులు ఆక్రమించారని ఆరోపించింది. స్పందించిన కలెక్టర్ మంగళవారం స్వయంగా సమస్య ఉన్న భూమి వద్దకు వచ్చి రెవిన్యూ రికార్డులను, భూమి తనిఖీ చేశారు. నివేదికలు అందజేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ శ్రీధర్