
పొన్నూటిపాళ్యంలో టెన్షన్..టెన్షన్
మదనపల్లె : వేటగాళ్ల ఉచ్చులో చిరుతపులి మృతి చెందిన ఘటనపై రాష్ట్రప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో...శుక్రవారం ఉదయం మదనపల్లె మండలం పొన్నూటిపాళ్యం గ్రామంలో టెన్షన్ నెలకొంది. అడవిలో ఉచ్చువేసి చిరుత మృతికి కారకులయ్యారంటూ గురువారం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేయడం, శుక్రవారం ఉదయాన్నే గ్రామాన్ని పోలీసులు, ఫారెస్ట్ అధికారులు చుట్టుముట్టడంతో గ్రామస్తుల్లో భయాందోళన నెలకుంది. చిరుతపులి మృతి ఘటనలో ఫారెస్ట్ అధికారులు గ్రామస్తుల్లో మరికొందరిని అరెస్ట్ చేస్తారన్న సమాచారం తెలియడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చిరుతమృతికి కారణాలను పరిశీలించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు పొన్నూటిపాళ్యం చేరుకున్న ఏపీ పీసీసీఎఫ్ చలపతిరావు, డీఎఫ్‌ఓ జగన్నాథసింగ్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, తిరుపతి సర్కిల్ ఎస్.సెల్వం తదితరులు నేరుగా అడవిలోకి వెళ్లారు. చిరుత మృతి చెందిన ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, కారణాలను అంచనా వేశారు. అనంతరం తిరిగి మదనపల్లెకు వస్తుండగా, పొన్నూటిపాళ్యం గ్రామస్తులు అధికారుల వాహనాలను అడ్డుకున్నారు. చిరుతపులి ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంతో, 8 గంటల సేపు నరకయాతన అనుభవించి, అధికారుల కళ్ల ముందే చనిపోయిందన్నారు. కాపాడే అవకాశాలున్నప్పటికీ, అధికారులు కాలయాపన చేస్తూ చిరుత చావుకు కారకులయ్యారని చెప్పుకొచ్చారు. గన్ పనిచేయకపోవడం, సరైన ఎక్విప్‌మెంట్, అనుభవం కలిగిన సిబ్బంది లేకపోవడంతోనే చిరుతపులిని అధికారులు కాపాడలేకపోయారన్నారు. ఈ ఘటనలో అధికారులు తమ వైఫల్యాలను చెప్పుకోకుండా, అమాయక రైతులను కేసులో ఇరికించి తప్పించుకోవాలని చూస్తున్నారన్నారు. పులిని చంపేంత ధైర్యం గ్రామస్తులకు లేదని, రైతులను విచారణ పేరుతో తీసుకెళ్లి అరెస్ట్ చేసి, అప్పటికప్పుడే రిమాండ్‌కు ఎలా పంపుతారని నిలదీశారు. ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్న కే.రెడ్డెప్పరెడ్డి, వెంకటరమణారెడ్డి, డి.గంగాధరకు ఘటనతో ఎలాంటి సంబంధం లేదన్నారు. డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణశాఖమంత్రి పవన్‌కల్యాణ్ అమాయకుల్ని కాపాడండంటూ నినాదాలు చేశారు. దీంతో పీసీసీఎఫ్ చలపతిరావు, గ్రామస్తులతో మాట్లాడుతూ..ప్రజల వినతిని రాతపూర్వకంగా మదనపల్లె ఫారెస్ట్ కార్యాలయానికి తెచ్చి ఇవ్వాల్సిందిగా చెప్పడంతో గ్రామస్తులు నిరసన విరమించారు. అనంతరం ఫారెస్ట్ కార్యాలయంలో, ఘటనకు, పొన్నూటిపాలెం గ్రామస్తులకు సంబంధం లేదని, అమాయకులను విడిచిపెట్టాల్సిందిగా కోరుతూ వినతిపత్రం సమర్పించారు. కేసును త్వరగా పరిష్కరించాలనే ఆతృతతో నిష్కారణంగా రైతులను బలిచేస్తున్నారన్నారు. పులి ఫారెస్ట్ ఏరియాలోని ఉచ్చులో తగులుకుంటే అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, విచారణ కోసం తీసుకువచ్చి 24గంటల్లోపు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు పంపేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక రైతులను విడిచిపెట్టి, అసలు దోషులను శిక్షించాల్సిందిగా కోరారు.
ఉదయాన్నే గ్రామాన్ని చుట్టుముట్టిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు
ఉచ్చు వేసిన ప్రాంతం పరిశీలనకు ఫారెస్ట్ ఉన్నతాఽధికారుల రాక
అమాయక రైతులను అరెస్ట్
చేశారంటూ గ్రామస్తుల ఆవేదన
ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంతోనే చిరుత చనిపోయిందంటూ ఆగ్రహం
అధికారులను అడ్డుకుని
నిరసన తెలిపిన గ్రామస్తులు

పొన్నూటిపాళ్యంలో టెన్షన్..టెన్షన్