
ఎన్నికల ప్రక్రియ బలోపేతానికి సూచనలే కీలకం
రాయచోటి: ఎన్నికల ప్రకియను బలోపేతం చేయడానికి రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సూచనలు కీలకమని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లాలో ఓటర్ల సవరణ–2025 పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు, వివిధ రకాల ఫారములు తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా డీఆర్‌ఓ మధుసూదనరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో గత సమావేశంలో చర్చించిన వివిధ విషయాలు, సంబంధిత చర్యలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు క్లుప్తంగా వివరించారు. ఓటర్ల సవరణ, బీఎల్‌ఓలు, వివిధ రకాల ఫారములు తదితర అంశాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్ సూచించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, మార్పులు కావాలి అనుకుంటే దానికి ఎన్నికల సంఘం వారు అవకాశం ఇస్తారని తెలిపారు. ఈవీఎంల గోడౌన్ సందర్శనను రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగే సమావేశం రోజునే జరిగితే బాగుంటుందని రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారు. సమావేశం అనంతరం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు డీఆర్‌ఓతో కలిసి ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్‌ను సందర్శించారు. సమావేశంలో కో–ఆర్డినేషన్ సెక్షన్ సూపరిటెండెంట్ రెడ్డప్ప రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్