కడప డీఎఫ్‌ఓ వినీత్‌కుమార్
సిద్దవటం : ప్రకృతిలో సమతుల్యత దెబ్బతినడం వల్లనే ఎండలు తీవ్రంగా ఉన్నాయని కడప డీఎఫ్‌ఓ వినీత్‌కుమార్ తెలిపారు. సిద్దవటం మండల శివారులోని రాజీవ్ స్మృతివనంలో గురువారం కడప స్థానిక అటవీ పునరుద్ధరణ ప్రాజెక్టుపై సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కడప డీఎఫ్‌ఓ వినీత్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రాజెక్టు పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందన్నారు. స్థానిక జాతి మొక్కలను అటవీ ప్రాంతంలో, ఇతర ప్రదేశాల్లో అభివృద్ధి చేయడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. అడవి జంతువుల రక్షణపై దృష్టిపెట్టాలని ఆయన అన్నారు. అటవీ సంరక్షణలో భాగంగా నర్సరీల ఏర్పాటుపై కూడా దృష్టి సారించాలని, నాణ్యమైన మొక్కలను ఉత్పత్తి చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని వివరించారు. వర్మీ కంపోస్టు (ఎరువు) తయారీ విధానాన్ని కూడా ప్రజలకు వివరించారు. ఇది మొక్కల పెంపకంలో ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆయన కోరారు. సబ్ డీఎఫ్‌ఓ స్వామి వివేకానంద మాట్లాడుతూ పర్యవరణాన్ని పచ్చదనంగా పెంపొందించు కోవాలంటే అటవీ సంపదను, చెట్లను అభివృద్ధి పరచుకోవాలన్నారు. ప్రాజెక్టు ఉద్దేశ్యం ఏమిటంటే స్థానికంగా ఉన్న ఎర్రచందనం, వేప, మర్రి, రాగి జువ్వి వంటి చెట్ల విత్తనాలను సేకరించి నర్సరీగా మొక్కలను పెంచాలని వాటిని అటవీ ప్రాంతాల్లో నాటాలన్నారు. వీటిపై జంతువులు, పక్షులు స్థావరాలు ఏర్పరచుకుంటాయన్నారు. దీంతో జీవ వైవిధ్యం పెరుగుతుందన్నారు. అటవీశాఖ ఒక్కటే ఏపని చేయలేదని, అందరి సహాయ సహకారం ఉంటే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకొని పోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో సోషియల్ ఫారెస్టు డీఎఫ్‌ఓ శివకుమార్, ఉపాధి ఏపీడీ సోమశేఖర్‌రెడ్డి, టీచర్స్ ఎన్‌జీఓ అధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డి, కడప, సిద్దవటం రేంజర్‌లు ప్రసాద్, కళావతి, కడప డీఆర్‌ఓ ఎస్. ఓబులేస్, వన సంరక్షణ సిబ్బంది, అటవీ సిబ్బంది , ప్రజలు పాల్గొన్నారు.