ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
ఇంటి స్థలం ఇచ్చి ఆదుకున్నారు
మాది నిరుపేద కుటుంబం. మాకు ఏ విధమైన ఆస్తులూ లేవు. ఉండటానికి సొంత ఇల్లు కూడా లేని పరిస్థితి. అటువంటి మాకు ఒకటిన్నర సెంటులో ఇంటి స్థలం ఇచ్చి మా కుటుంబాన్ని జగన్ సర్కారు ఆదుకుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురుకు చెందిన మా కుటుంబానికి నవరత్నాల ద్వారా ఎంతో లబ్ధి చేకూరింది. నా భర్త వెంకటేశ్వరరావు కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రూ.రెండు లక్షలు విలువైన ఇంటి స్థలం ఇచ్చారు. మా అబ్బాయి జగదీశ్‌కు జగనన్న విద్యా దీవెన ద్వారా రూ.23,850 అందించారు. వైఎస్సార్ ఆసరా కింద ఇప్పటి వరకు రూ.68 వేలు అందింది. మా కుటుంబం ఈ రోజు ఆర్థి కంగా నిలదొక్కుకోవడానికి కారణమైన ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – యడ్ల దుర్గ, మామిడికుదురు (యేడిద బాలకృష్ణ, విలేకరి, మామిడికుదురు)
సంతోషంగా వ్యవసాయం
మాది వ్యవసాయ కుటుంబం. సొంత భూమి లేకపోయినా పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కిమ్మి గ్రామంలో మూడెకరాలు కౌలుకు తీసుకుని మా ఆయన శంకరరావు సాగు చేస్తున్నారు. అందులో వరి, చెరకు పండిస్తున్నాం. ఏటా వ్యవసాయానికి పెట్టుబడి అవసరం ఉంటుంది. అప్పుడు తప్పనిసరిగా అప్పు చేయడం.. పంట చేతికొచ్చాక తీర్చేయడం అలవాటు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత అప్పు చేయాల్సిన అవసరం తప్పింది.
ఇప్పుడు రైతు భరోసా వస్తోంది. మా మామగారికి వృద్ధాప్య పింఛన్ వస్తోంది. మా అత్తకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ.18,750 చొప్పు అందింది. మా అత్త చేయి ఆపరేషన్‌కు పైసా ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీ పథకం ద్వారా చేయించుకోగలిగాం. మాకు ఇద్దరు పిల్లలు. వారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. పాప పేరున మూడేళ్లుగా అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు వంతున వస్తోంది. మా కుటుంబానికి ఇంత మేలు జరిగిందంటే కారణం ఈ ప్రభుత్వమే. సీఎం జగనన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. – అలుజు రజిని, కిమ్మి (కొలిపాక సింహాచలం, విలేకరి, వీరఘట్టం)
అమ్మాయి చదువు బెంగతీరింది
మా ఆయన విజయనగరం జిల్లా బాడంగి మండలం గూడెపువలస గ్రామంలో చిల్లర వ్యాపారం చేసేవారు. ఆయన సంపాదనతోనే మా కుటుంబం గడిచేది. అనుకోకుండా గతేడాదే ఆయన కన్ను మూయడంతో అక్కడ వ్యాపారాన్ని మూసేసి బాడంగిలో టీ కొట్టు పెట్టుకుని ఒక్కగానొక్క కుమార్తెను చదివించుకుంటున్నా. వచ్చిన ఆదాయంతో మా పాపకు ఉన్నత చదువులు అందించగలనా.. అన్న భయం ఉండేది. రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం రావడంతో ఆ భయం తీరిపోయింది.
మా అమ్మాయి సాహితి ప్రస్తుతం బాడంగిలోని ఒక ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఆమెకు అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు అందుతోంది. దీనివల్ల అమ్మాయి చదువు బెంగ తీరింది. నాకు వైఎస్సార్ పింఛన్ కానుక ప్రతి నెలా ఒకటో తేదీనే అందుతోంది. వైఎస్సార్ ఆసరా ద్వారా ఇప్పటి వరకూ రూ.30 వేలు, సున్నా వడ్డీ కింద రూ.12 వేలు అందింది. ప్రస్తుతానికి మేము ఆర్థి కంగా కుదుటపడగలిగాం. ఇందుకు కారణమైన జగనన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. – బండి సంతోష్, గూడెపువలస (గొట్టాపు కృష్ణమూర్తి, విలేకరి, బాడంగి)
Comments
Please login to add a commentAdd a comment