ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
ఆపత్కాలంలోనూ ఆదుకున్న దేవుడు
మాది మధ్యతరగతి కుటుంబం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన మాకు కొద్దిపాటి భూమి ఉన్నా... పంటలు పండిన దాఖలాల్లేవు. ప్రతి ఏటా పెట్టుబడి పెట్టడం... ఆనక పరిస్థితులు అనుకూలించక నష్టపోవడం మాకు అలవాటైపోయింది. ఈ పరిస్థితుల్లో అప్పులు తప్పేవి కాదు. గత ప్రభుత్వం మాకు ఏ విధంగానూ సాయమందించిన దాఖలాల్లేవు. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తరువాత అందించిన నవరత్నాల ద్వారా మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది.
నా భార్యకు వైఎస్సార్ చేయూత ద్వారా ఏడాదికి రూ.18,750లు, వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.600, వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.6,204 అందాయి. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏడాదికి రూ. 13,500 వంతున, వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి రూ. 24వేలు అందింది. అంతేగాకుండా ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్ వచ్చింది. కోవిడ్ వంటి ఆపత్కాలంలో కూడా సంక్షేమ పథకాలు అందించిన మహానుభావుడు జగనన్న. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. – భళ్ల సాయిమల్లికార్జున, అప్పనపల్లి (యేడిద బాలకృష్ణ, విలేకరి, మామిడికుదురు)
పైసా ఖర్చు లేకుండా సచివాలయ ఉద్యోగాలు
ఉన్న ఊళ్లో ఉపాధి లేక ప్రస్తుతం విజయనగరం జిల్లా రేగిడి మండలం మడ్డువలస రిజర్వాయర్ ముంపు గ్రామం కొట్టిశ నుంచి 2001లో పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట గ్రామానికి వలస వచ్చాం. నేను బీఏ, బీఈడీ చేసినా ప్రభుత్వ ఉద్యోగం దొరకక ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్ పనిచేస్తూ ఇద్దరు పిల్లల్ని చదివించుకున్నాను. నాకు రెండెకరాల భూమి, ఇల్లు ఉంది. పిల్లలు ఇద్దరూ పదో తరగతి పాసయిన తరువాత ఉన్నత చదువులు చదివించేందుకు శక్తి చాలక డిప్లమోలు చేయించాను. అబ్బాయి మణికృష్ణ అగ్రికల్చర్ డిప్లమో, అమ్మాయి కీర్తిప్రియ ఫిషరీస్ డిప్లమో చేశారు.
అదృష్టవశాత్తూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సచివాలయాలు ఏర్పాటు చేయడంతో మా పిల్లలు ఇద్దరికీ సచివాలయ ఉద్యోగాలు వచ్చాయి. అబ్బాయి నూకలవాడ సచివాలయం, అమ్మాయి వెంగాపురం సచివాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలకు ఎవరి చుట్టూ తిరగలేదు. ఎవరికీ ఒక్క పైసా అయినా ఇవ్వలేదు. పూర్తిగా మెరిట్‌తోనే తప్ప లంచాలకు, సిఫార్సులకు తావులేకుండా నియామకాలు జరిగాయి. ఇంతటి పారదర్శకంగా మా పిల్లలకు ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – ఎ.పోలినాయుడు, బలిజిపేట (పి.కోటేశ్వరరావు, విలేకరి, సీతానగరం)
ప్రభుత్వ సాయంతో చేపల వ్యాపారం
ఈ ప్రభుత్వం అందించిన సాయంతో చేపల వ్యాపారం ప్రారంభించాను. రోజూ వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నాను. మాది విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం పెదనాగమయ్యపాలెం. నేను మణికంఠ డ్వాక్రా గ్రూప్‌లో సభ్యురాలిగా ఉన్నాను. వైఎస్సార్ ఆసరా ద్వారా ఇప్పటివరకు రూ.72 వేలు లబ్ధిపొందాను. చేయూత ద్వారా ఏటా 18,750 వంతున వచ్చింది.
నా భర్త కొండకు వైఎస్సార్ పెన్షన్ కానుక అందుతోంది. మా అబ్బాయి మత్స్యకార భరోసా ద్వారా రూ.50 వేలు వచ్చాయి. మనుమడు అప్పలరాజుకు విద్యాదీవెన కింద రూ.24వేలు, మనుమరాలు పూర్ణకు అమ్మఒడి ద్వారా ఏడాదికి రూ. 15వేలు వంతున ప్రభుత్వం నుంచి పొందాము. ఈ ప్రభుత్వం అందించిన పథకాల వల్ల వచ్చిన డబ్బుతో చేపల వ్యాపారం చేస్తున్నాను. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో చేపలు కొని తగరపువలస ప్రైవేట్ మార్కెట్‌కు వెళ్లి విక్రయిస్తాను. రోజుకు రూ.400 నుంచి రూ.1000 ఆదాయం వస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పాలనలో మా కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది. మళ్లీ ఈ ప్రభుత్వమే రావాలి. – గరికిన ధనలక్ష్మి, పెదనాగమయ్యపాలెం (గేదెల శ్రీనివాసరెడ్డి, విలేకరి, తగరపువలస)
Comments
Please login to add a commentAdd a comment