
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
మధ్యవర్తులతో పనిలేకుండా పింఛన్
నా భర్త చినఅప్పారావు ఎనిమిదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. 2017లో వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. జన్మభూమి కమిటీ సిఫార్సు లేదని తిరస్కరించారు. ఏడాది తరువాత మళ్లీ దరఖాస్తు చేశాను. అప్పుడూ అదే పరిస్థితి తలెత్తితే నేరుగా అధికారుల వద్దకు వెళ్లాను. పంచాయతీలోని తెలుగుదేశం పార్టీకి చెందిన జన్మభూమి కమిటీ సభ్యులు సంతకం పెడితేనే పింఛన్ మంజూరు చేస్తామని తెగేసి చెప్పారు.
అధికారులు చెప్పినట్లే జన్మభూమి కమిటీని కలిస్తే కనీసం పట్టించుకోలేదు. భర్తను కోల్పోయానన్న కనికరం కూడా లేకుండా టీడీపీ జెండా పట్టుకుంటేనే పింఛన్ వచ్చేలా చేస్తామని షరతులు పెట్టారు. అలా మూడేళ్లు నానాతిప్పలు పెట్టి జన్మభూమి కమిటీలోని టీడీపీ నాయకులు పింఛన్ లేకుండా చేశారు. 2019లో ఈ ప్రభుత్వం రాగానే పార్టీలతో పనిలేకుండా ఎలాంటి షరతులు లేకుండా నాకు పింఛన్ మంజూరైంది.
ఇప్పుడు ప్రతీ నెల ఒకటో తేదీనే వలంటీర్ వచ్చి ఇంటి వద్దే నాకు పింఛన్ ఇస్తున్నారు. మా పాప సౌజన్యకు వరుసగా నాలుగు దఫాలు ఏటా రూ.15 వేల వంతున జగనన్న అమ్మ ఒడి పడింది. ప్రస్తుతం ఇంటరీ్మడియట్ చదువుతోంది. జగనన్న విద్యా దీవెన కోసం పేరు నమోదు చేసుకున్నారు. వైఎస్సార్ ఆసరా ద్వారా డ్వాక్రా రుణమాఫీ అయింది. ఇలా మాకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చాలా మేలు జరిగింది. ఎప్పటికీ జగనన్నే సీఎంగా కొనసాగాలని కోరకుంటున్నాము. – కిల్లాన దేవి, ఇప్పిలివానిపాలెం, పెందుర్తి మండలం, విశాఖపట్నం జిల్లా (సమ్మంగి భాస్కర్, విలేకరి, పెందుర్తి)
గూడు ఇచ్చిన దేవుడు..
మీరు పెద్ద కులపోళ్లు.. మీకు ఇల్లు ఎందుకంటూ వచ్చిన పట్టాను కూడా గత పాలకులు లాక్కుంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఇంటి స్థలంతో పాటు డబ్బు కూడా మంజూరు చేయడంతో ఏళ్ల తరబడి ఎదురుచూసిన మా సొంతింటి కల నిజమైంది. మాది కృష్ణాజిల్లా గన్నవరం మండలం ఆత్కూరు గ్రామం. 20 సంవత్సరాల క్రితం బతుకు తెరువుకోసం గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి వలస వచ్చేశాం.
మాకు ఏ పనులూ చేతకాకపోవడంతో మా వారు హరిప్రసాద్‌తో కలిసి టిఫిన్ బండి పెట్టుకొని జీవనం సాగిస్తున్నాం. మాకు ఇద్దరు పిల్లలు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మావి. ఏళ్ల తరబడి అద్దె ఇళ్లల్లో ఉంటూ బాడుగ కట్టలేక ఇబ్బందులు పడేవాళ్లం. పదేళ్ల క్రితం ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకుంటే అప్పటి పాలకులు స్థలం మంజూరు చేసి కూడా ‘పెద్ద కులపోళ్లు మీకు ఇల్లు లేకపోవడమేమిటి ఎక్కడో ఓ చోట ఉంటుంది కదా’ అంటూ దానిని తీసుకున్నారు. దీంతో సొంత ఇంటిపై ఆశ చంపుకొని అద్దె ఇంట్లోనే జీవనం కొనసాగించాం.
ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు చేశాం. ఈ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఇంటి స్థలం కోసం అర్జీ పెట్టుకున్నాం. జగనన్న లేఅవుట్‌లో మాకు స్థలం కేటాయించారు. దీంతోపాటు రూ. 1.80 లక్షల నగదు కూడా మంజూరు చేయడంతో దీనికి మరికొంత కలుపుకొని ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు అద్దె కట్టాలి్సన బాధ లేదు. సొంత ఇంటిలో ప్రశాంతంగా ఉంటున్నాం. మా ఆయనకు వృద్ధాప్య పింఛనుతో పాటు, నాకు ఈబీసీ నేస్తం కింద రూ. 15 వేలు నా ఖాతాలో జమయింది. మా చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన ఈ ప్రభుత్వానికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం. మాలాంటి నిరుపేదలను కుల, మతాలకు అతీతంగా ప్రభుత్వం ఆదుకోవడం సంతోషంగా ఉంది. – వందనపు శ్యామలాదేవి. ఫిరంగిపురం. గుంటూరు జిల్లా (డి.సత్యనారాయణ, విలేకరి, ఫిరంగిపురం. గుంటూరు జిల్లా)
కుటుంబానికి ఆసరా అయ్యాను
నేను షిర్డి సాయి మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉన్నాను. పేద కుటుంబం. భర్త రోజువారీ కూలీ కావ డంతో కటుంబ పోషణ కష్టంగా ఉండేది. మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉన్న నాకు వైఎస్సార్ ఆసరా పథకంలో ఏడాదికి రూ.18,000 చొప్పున మూడేళ్లుగా రూ.54,000 లబ్ధి చేకూరింది. ఆ మొత్తంతో మా సొంతూరైన కాకినాడ జిల్లా తుని మండలం గొల్లంపేట గ్రామంలో చిన్నపాటి టిఫిన్ సెంటర్ పెట్టాను. సొంతంగా సరుకులు కొని వాటితో కూరల వంటి పలు రకాల వంటకాలను తయారు చేసి విక్రయిస్తున్నాను.
ఆసరా సొమ్మును పెట్టుబడిగా పెట్టి సొంత కాళ్లపై నిలబడి కుటుంబానికి బాసటగా ఉన్నాను. గతంలో వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు చేసేదాన్ని. వచ్చిన ఆదాయంలో సగం వడ్డీగా కట్టేదాన్ని. ఆ పరిస్థితుల నుంచి మనసున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆసరా పథకంతో మాలాంటి పేదల జీవితంలో వెలుగులు నింపారు. నాకు 45 సంవత్సరాలు నిండడంతో వైఎస్సార్ చేయూత పథకం కింద ఏడాదికి రూ.18,750 చొప్పున మూడేళ్లకు రూ.56,250 అందుకున్నాను.
ఓ వైపు ఆసరా. చేయూత పథకాలు నా జీవితానికి భరోసాగా నిలిచాయి. నాకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం కుమారుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కుమార్తెకి వివాహం చేశాం. ఇప్పుడు మా కుటుంబం ఆనందంగా ఉంది. జగన్ చేసిన మేలు మరచిపోలేం. – నాళం వెంకట లక్ష్మి, గొల్లపేట (రెడ్డి చిట్టిబాబు, విలేకరి, తుని)