ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
మాలాంటోళ్లకు ఈ ప్రభుత్వమే దిక్కు
మాది చాలా పేద కుటుంబం. నా వయసు 66 సంవత్సరాలు. విశాఖపట్నం మురళీనగర్‌లోని ఎన్‌జీవోస్ కాలనీలో ఉంటున్నాము. నేను గతంలో రజక వృత్తి చేసుకుని కుటుంబాన్ని పోషించే వాడిని. నాకు ఐదారేళ్ల కిందట కీళ్ల సమస్య రావడంతో కదలలేని పరిస్థితి ఏర్పడింది. మంచాన పడ్డ నన్ను ఎవరైనా లేవదీసి కూర్చోబెట్టినా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను. గత ప్రభుత్వంలో పింఛన్ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా రాలేదు.
ఈ ప్రభుత్వం వచ్చాక నా దీనస్థితిని తెలుసుకున్న వలంటీర్ ఇంటికి వచ్చి మరీ పింఛన్‌కు దరఖాస్తు చేయించారు. వెంటనే మంజూరైంది. ప్రస్తుతం నాకు ప్రతి నెలా ఒకటో తారీఖునే పింఛను వస్తోంది. ఈ నెల నుంచి రూ.3 వేలు ఇస్తున్నారు. ఈ సొమ్ము మా కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంది. నా భార్య నారాయణమ్మ ఇళ్లల్లో పనిచేస్తూ కుంటుంబానికి చేదోడుగా ఉంటోంది. పెళ్లీడుకు వచ్చిన కూతురు మంగమ్మ ఉంది. మాకు ఆర్థిక స్తోమత లేక, ఆమె మానసిక పరిస్థితి బాగోలేక పెళ్లి చేయలేకపోయాం. ఆరోగ్యశ్రీ కార్డు కూడా వచ్చింది. పైసా ఖర్చు లేకుండా చికిత్స చేయించుకోగలుగుతున్నాం. రేషన్ కార్డుపై ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. మా లాంటి వారి కోసం శ్రద్ధ తీసుకుంటున్న ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – గుమ్మిడి కనకం, విశాఖపట్నం (కసిరెడ్డి సూర్యకుమారి వెంకట్, విలేకరి, మురళీనగర్)
పేదల ప్రాణానికి పెద్ద దన్ను
ఆటోయే మా జీవనాధారం. మన్యం జిల్లా పార్వతీపురంలో నేను ఆటో నడపడం ద్వారా వచ్చిన ఆదాయంతో పాటు నా భార్య టైలరింగ్ చేయడం ద్వారా కొంత సంపాదిస్తోంది. దాంతో కుటుంబాన్ని గుట్టుగా పోషించుకుంటున్నాం. వచ్చిన ఆదాయంలోనే ఒకవైపు ఇన్సూరెన్స్, వివిధ మరమ్మతు పనులు వంటివి కూడా చేసుకోవాలి. మిగిలిన దాంతో జీవించాలి. ఇంతలో పులిమీద పుట్రలా 2019లో ఒకరోజు ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రావడంతో వైద్యులను సంప్రదించాను.
గుండెలో మూడు రక్తనాళాలు మూసుకుపోయినట్లు గుర్తించారు. బైపాస్ సర్జరీ తప్పనిసరిగా చేయాలని చెప్పారు. చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బంది పడుతున్న నాకు సర్జరీ అంటే భయం వేసింది. ఇక బతకనేమోనన్న భయం పట్టుకుంది. నా కుటుంబం గురించి ఆలోచించే సరికి ప్రాణం విలవిలలాడింది. ఆ సమయంలో స్నేహితుల సలహాతో విశాఖ మెడికవర్ ఆస్పత్రికి వెళ్లగా.. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రెండున్నర లక్షల రూపాయల ఆపరేషన్‌ను ఉచితంగా చేశారు. ఏడాదికి సరిపడా మందులు ఇచ్చి కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు.
ఆ సమయంలో కుటుంబ పోషణ నిమిత్తం రెండు నెలలకు రూ.10,000 అందజేశారు. నెమ్మదిగా కోలుకున్నాను. ఇప్పుడు మళ్లీ ఆటో నడుపుకోగలుగుతున్నా. ఏటా నాకు వాహన మిత్ర ద్వారా రూ.10 వేలు అందుతోంది. నా కుమార్తె హిమబిందు నాలుగో తరగతి చదువుతోంది. ఆమెకు అమ్మ ఒడి పథకం వర్తించింది. ఏటా రూ.15 వేలు వంతున నా భార్య ఖాతాలో నగదు జమవుతోంది. టైలరింగ్ చేస్తుండటం వల్ల ఆమెకు చేదోడు పథకం ద్వారా ఏటా రూ.10 వేలు అందుతోంది. మాకు జగనన్న కాలనీలో ఇంటి స్థలం, ఇల్లు మంజూరైంది. నిర్మాణం పురోగతిలో ఉంది. మాలాంటి పేద బతుకులకు ఈ ప్రభుత్వం అండగా నిలుస్తోంది.
– పొందూరు విజయ్‌కుమార్, పార్వతీపురం (ఆశపు జయంత్‌కుమార్, విలేకరి, పార్వతీపురం రూరల్)
అప్పు చేయకుండా చేపల వ్యాపారం
మేం మత్స్యకారులం. కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక గ్రామంలో చేపలతోపాటు ఎండు చేపలు అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నాం. జగన్ వచ్చిన తర్వాత నాకు ఏటా క్రమం తప్పకుండా చేయూత పథకం ద్వారా డబ్బులొస్తున్నాయి. ఏడాదికి రూ.18,750 చొప్పున ఇంత వరకు రూ.56,250 వచ్చింది. ఆ డబ్బునే పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తున్నా.
రేవు వద్ద చేపలుకొని మార్కెట్‌లో అమ్ముకుంటున్నా. పెట్టుబడికి అప్పులు చేయాల్సిన అవసరం లేదు. గతంలో మూడు రూపాయల వడ్డీకి తెచ్చుకొని చేపలు కొనుక్కుని, అమ్ముకునే వాళ్లం. లాభం చాలా వరకు వడ్డీలకే వెళ్లిపోయేది. ఇప్పుడు వడ్డీ బాధ లేదు. పేదల కోసం ఆలోచించే వ్యక్తి జగన్. అందుకే మాలాంటి వాళ్లం సంతోషంగా ఉంటున్నాం. వైఎస్సార్ ఆసరా కింద రూ.60 వేలు వచ్చింది. మా ఆయనకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. దీంతో మా కుటుంబం హాయిగా జీవిస్తోంది. – ఓలేటి మంగాయమ్మ, పశువుల్లంక (డీవీవీ సుబ్బారావు, విలేకరి, ఐ పోలవరం
Comments
Please login to add a commentAdd a comment