ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
వ్యాపారం చేస్తూ బతుకుతున్నాం
నేను, నా భర్త మానుకొండ రామారావుతో కలసి గతంలో కూలిపనులు చేసుకుని జీవనం సాగించేవాళ్లం. మాకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె నిషికి ఐదు నెలల క్రితం వివాహం చేశాం. కుమారుడు ప్రసన్న కుమార్ ఐటీఐ చదువుతున్నాడు. చిన్న కుమార్తె రూప ఇంటర్ పూర్తి చేసింది. ముగ్గురికీ ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా అందించిన ఆర్థికసాయంతోనే చదివించగలిగాం. కూలి పనులకు వెళ్లలేక మూడేళ్ల క్రితం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం సత్తెన్నగూడెంలో ఇంటి వద్దే ఒక చిన్న పచారీ కొట్టు పెట్టాను. అప్పు చేసి, పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని అతి కష్టం మీద నడిపేదాన్ని.
చేతిలో చిల్లిగవ్వ లేక, వ్యాపారం సజావుగా సాగక, కుటుంబ పోషణ భారమైన సమయంలో వైఎస్సార్ ఆసరా పథకం నా కుటుంబాన్ని ఆదుకుంది. ఏడాదికి 15,357 చొప్పున మూడు దఫాలుగా ఇప్పటి వరకు నా పొదుపు ఖాతాలో రూ.46,071 జమ అయ్యింది. దీనికి తోడు జగనన్న తోడు పథకం కింద రూ.10 వేలు చొప్పున రెండు దఫాలుగా రూ.20 వేలు సాయం అందింది. ఈ నగదు వ్యాపార అవసరాలకు ఎంతగానో ఉపయోగపడింది. ఈ దుకాణానికి అద్దె, కరెంటు బిల్లు పోను నెలకు సుమారు రూ.12 వేలు ఆదాయం వస్తోంది. – మానుకొండ శ్రీలత, సత్తెన్నగూడెం, ద్వారకాతిరుమల మండలం (యండమూరి నాగవెంకట శ్రీనివాస్, విలేకరి, ద్వారకాతిరుమల)
కూలి పనులు మాని వస్త్రాలు నేస్తున్నాం
మేం చేనేత కార్మికులం. మగ్గంపై వస్త్రాలు నేసి, ఆ ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. గత ప్రభుత్వాలు నేత కార్మికులను పట్టించుకోకపోవడం నూలు కొనుగోలుకు సబ్సిడీ ఇవ్వకపోవడం, పెట్టుబడి సాయం చేయకపోవడంతో వారంతా కులవృత్తికి దూరమయ్యారు. అప్పు చేసి ముడి సరుకు కొనుగోలు చేసి నేను నా భార్య కష్టపడి మగ్గం నేస్తే పెట్టుబడి, వడ్డీలు పోను రోజుకు రూ.500లు మిగలడం కష్టమయ్యేది. లాభం లేక పొట్టకూటి కోసం వ్యవసాయ కూలి పనులకు, సిమెంట్ కాంక్రీటు పనులకు, కంపెనీల్లో పనుల కోసం వలస పోవాల్సి వచ్చింది.
భార్యభర్తలం ఎండలో కష్టపడితే రోజుకు రూ.700లు వచ్చేది. అలవాటు లేకపోయినా పొట్టపోషణకోసం ఆ పనులు చేయాల్సి వచ్చేది. దేవుడు జగనన్న రూపంలో వచ్చాడు. తాను అధికారంలోకి వస్తే చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకు వస్తానని ప్రకటించారు. పాదయాత్రలో నేతన్నల కష్టాలు స్వయంగా చూశారు. నేతన్నలకు నెలకు రూ.2 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామన్నారు. సీఎం అయిన వెంటనే మూడు మాసాలు తిరక్కుండానే నేతన్న నేస్తం పథకం కింద నెలకు రూ.2 వేల చొప్పున ఏడాదికి సరిపడా రూ.24 వేలు ఒకే విడతలో మా ఖాతాల్లో జమ చేశారు. ఐదేళ్లనుంచి నిరాటంకంగా ఈ సాయం అందిస్తున్నారు.
ఇప్పటివరకు రూ.1.20 లక్షలు నా ఖాతాల్లో జమయ్యాయి. ఇప్పుడు మేము ఎంచక్కా కుల వృత్తికి దగ్గరయి, అప్పు చేయకుండా ముడిసరుకు కొనుగోలుచేసి వస్త్రాలు తయారు చేసి విక్రయించుకుంటున్నాం. రోజుకు సుమారు వెయ్యి రూపాయల ఆదాయం వస్తోంది. ఇంటివద్దే ఉంటూ ఉపాధి పొందుతూ కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఈ ప్రభుత్వం చేసిన సాయాన్ని ఎన్నటికీ మరువలేం. – మాడెం రాజు, నక్కపల్లి, అనకాపల్లి జిల్లా (ఆచంట రామకృష్ణ, విలేకరి, నక్కపల్లి, అనకాపల్లి జిల్లా)
వ్యవసాయానికి ఇప్పుడు చింత లేదు
మాది వ్యవసాయ కుటుంబం. కొల్లేరు తీరంలోని కాళింగగూడెంలో నాకు ఎకరంన్నర సొంత భూమి ఉండగా మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాను. ఈ ప్రాంతంలో వ్యవసాయం కత్తిమీద సాములా ఉండేది. ముంపునకు ముందు.. సాగుకు వెనుక అన్న చందంగా ఉండేది. కొల్లేరు ముంపుతో ఖరీఫ్ సాగు నష్టపోతుండగా, తుఫాన్ల వల్ల రబీ సాగు కోల్పోయేవాళ్లం. కౌలు కూడా చెల్లించలేని దుస్థితిలో తినడానికి ఒక్క గింజైనా మిగిలేది కాదు. ప్రతి ఏటా అధిక వడ్డీలకు సొమ్ము తెచ్చి పెట్టుబడులు పెట్టి సాగు చేసినా చేతికి చిల్లిగవ్వ దక్కేది కాదు. అప్పుల ఊబిలో కూరుకుపోయేవాళ్లం.
పిల్లల్ని చదివించలేక, పండగలు ఆనందంతో జరుపుకోలేక నానా అవస్థలూ పడేవాళ్లం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కష్టాలు చాలావరకూ తొలగిపోయాయి. సొంత భూమికి రైతు భరోసా సొమ్ము ఏటా రూ. 13,500లు వంతున వస్తోంది. పంట నష్టపరిహారం, బీమా సొమ్ములు ఏటా అందుతున్నాయి. పండించిన పంటకు మద్దతు ధర లభిస్తోంది. పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో అమ్మిన రెండు, మూడు రోజులకే సొమ్ము బ్యాంకు అకౌంట్‌లో పడిపోతోంది. నాకు ఇద్దరు కుమార్తెలున్నారు.
ఒక పాపకు అమ్మ ఒడి సొమ్ము ఏటా రూ. 15వేలు వంతున నా భార్య అకౌంట్‌లో జమవుతోంది. మరో పాపకు విద్యాదీవెన, వసతి దీవెన వర్తిస్తోంది. ఇద్దరు పిల్లల చదువుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ఉంది. ఇప్పుడు సంతోషంగా జీవనం గడుపుతున్నాం. మా లాంటివారిని ఆదుకుంటున్న ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం. – తమ్మినేని రంగారావు, కాళింగగూడెం, ఆకివీడు మండలం (బి.ఆర్.కోటేశ్వరరావు, విలేకరి, ఆకివీడు)
Comments
Please login to add a commentAdd a comment