
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
నా కాళ్లపై నిలబడ్డా
మాది మధ్య తరగతి కుటుంబం. తల్లిదండ్రులు లేకపోవడంతో అక్కే నాకు ప్రపంచం. అక్కకు పెళ్‌లై పిల్లలు కూడా ఉన్నారు. అక్కకు చేదోడు, వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో నేను పెళ్లి కూడా చేసుకోకుండా ఆమె వద్దే ఉంటున్నా. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బిర్లంగి గ్రామానికి చెందిన స్వయం శక్తి సంఘానికి అధ్యక్షురాలిగా ఉన్నాను. స్వయం శక్తి సంఘం బ్యాంకు లింకేజీ రుణం రూ.50 వేలు, స్త్రీనిధి ద్వారా లక్ష రూపాయలు రుణం తీసుకున్నా. ఈ సొమ్ముతో ఇంటి వద్దనే చిన్నపాటి పరిశ్రమ ఏర్పాటు చేసుకొని అక్క కుటుంబ సభ్యులతో కలసి అగరువత్తులు, ఫినాయిల్, కొవ్వొత్తులు తయారు చేస్తున్నాం.
ఇంటి వద్దనే చిన్నపాటి స్టాల్‌ను ఏర్పాటు చేసి అమ్మకాలు చేస్తున్నాం. మా అక్క కొడుకులు ఒడిశాలోని బరంపురం, ఇచ్ఛాపురం ప్రాంతాలకు తీసుకువెళ్లి వాటిని అమ్ముకొస్తున్నారు. ప్రస్తుతం ఆదాయం బాగానే ఉంది. ఆసరా పథకం ద్వారా నాకు ఏటా రూ.18,750 చొప్పున వచ్చిన సొమ్ముతో మాకున్న ఎకరంన్నర పంట పొలంలో ఆకు కూరలు, కూరగాయలు సాగు చేస్తున్నాం. మా ప్రాంతంలో వీటికి మంచి డిమాండ్ ఉండటంతో విక్రయాలు బాగానే జరుగుతున్నాయి.
మా సంఘం ద్వారా మరో రూ.75 వేలు రుణం తీసుకుని కాయగూరల పెంపకాన్ని విస్తరించబోతున్నా. ఈ నెల నుంచే ఒంటరి మహిళకు ఇచ్చే పింఛన్ వస్తోంది. గత ప్రభుత్వ హయాంలో చాలా సార్లు పింఛన్ కోసం అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. మా వలంటీర్ స్వయంగా వచ్చి దరఖాస్తు చేయించి, మంజూరు చేయించింది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. – దేవాకి భడిత్యా, బిర్లంగి (మద్దిలి కేశవరావు, విలేకరి, ఇచ్ఛాపురం రూరల్)
కూలి పనులు మాని వ్యాపారం
మా ఆయన విజయనగరం జిల్లా రాజాం మండలం గడిముడిదాం గ్రామంలో కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించేవారు. వచ్చిన అరకొర ఆదాయంతో కుటుంబ పోషణ కష్టంగా ఉండేది. మాకు ఒక బాబు, ఒక పాప ఉన్నారు. వారిని చదివించాలంటే మాకు తలకు మించిన భారంగా మారింది. ఏదైనా వ్యాపారం చేద్దామంటే పెట్టుబడి ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈలోగా ఈ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో చాలా వరకు మా సమస్యలు పరిష్కారమయ్యాయి.
మా పిల్లలను బడికి పంపించడం వల్ల అమ్మ ఒడి పథకం వర్తించింది. దాని ద్వారా ఏటా రూ.15 వేలు వంతున వస్తోంది. నాకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఏడాదికి రూ.8,200 చొప్పున వచ్చింది. ఆ మొత్తానికి స్త్రీ నిధి ద్వారా లక్ష రూపాయలు రుణం తీసుకుని సొంతంగా మా గ్రామంలో ఎరువుల వ్యాపారం ప్రారంభించాం. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,750 వచ్చింది. దానిని వ్యాపారానికి వినియోగించాను. ఇప్పుడు ప్రతి నెల రూ.6 వేలు వరకు ఆదాయం వస్తోంది. భార్యభర్తలిద్దరం కలిసి ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు మేము గౌరవంగా బతుకుతున్నామంటే దానికి కారణం జగనన్న ప్రభుత్వమే. – ఏగిరెడ్డి లక్ష్మి, గడిముడిదాం (వావిలపల్లి వెంకట దుర్గారావు, విలేకరి, రాజాం)
ప్రశాంతంగా జీవిస్తున్నాం
మా ఆయన అనకాపల్లి జిల్లా చోడవరం మండలం రాయపురాజుపేటలో ఎలక్ట్రికల్ పనులు చేస్తుంటారు. సంపాదన అంతంత మాత్రమే. మాకు ఒక బాబు, పాప ఉన్నారు. కుటుంబ పోషణే కష్టమవుతుండేది. ఇక పిల్లల చదువులు భారంగానే అనిపించేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా కుమార్తెకు 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేల వంతున మూడేళ్ల పాటు రావడం ఎంతగానో ఉపకరించింది. ఇప్పుడు ఆమె డిగ్రీలో జాయిన్ అయ్యింది. ఈ ఏడాది జగనన్న విద్యా దీవెన కింద డిగ్రీ ఫీజుతో పాటు, జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఒక విడత రూ.10 వేలు వచ్చింది.
మా కుమారుడు మహేష్ పాలిటెక్నిక్ చదివిన సమయంలో విద్యా దీవెన వచ్చింది. ప్రస్తుతం ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. రెండో సంవత్సరానికి రూ.40 వేలు ఫీజు, వసతి దీవెన పథకం సొమ్ము రూ.10 వేల వంతున రెండేళ్లుగా అందింది. నేను డ్వాక్రా గ్రూపులో సభ్యురాలిగా ఉన్నాను. ఆసరా పథకం సొమ్ము మా అకౌంట్‌లో పడింది. చేయూత పథకం ద్వారా ఏటా రూ. 18,750 వంతున వస్తోంది. మాకు కొంత భూమి ఉంది. రైతు భరోసా మొత్తం ఏటా రూ.13,500 పడింది. ఈ విధంగా జగనన్న ప్రభుత్వం మా కుటుంబాన్ని ఎంతగానో ఆర్థికంగా ఆదుకుంది. దీంతో మా ఇద్దరు పిల్లల్ని ఉన్నత చదువులు చదివించుకోవడం మాకు కష్టం అనిపించలేదు. – కోరిబిల్లి వెంకటి, రాయపురాజుపేట (వేగి మహాలక్ష్మినాయుడు, విలేకరి, చోడవరం రూరల్)
Comments
Please login to add a commentAdd a comment