ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
సొంతంగా చీరలు నేస్తున్నా..
నా భర్త మహదేవ్ టైలరింగ్ చేస్తారు. రోజుకు రూ.500 నుంచి 600 ఆదాయం వస్తుంది. ఇద్దరు పిల్లలు. సౌమ్య, స్వామి సమర్థ. అమ్మాయి కాలం చేసింది. స్వామి సమర్థ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఇంటి అద్దె రూ.2,800 చెల్లిస్తున్నాం. ఒకరి ఆదాయంతో ఇల్లు నడపడం కష్టంగా ఉండేది. దాంతో చీరలు నేసే కూలి పనికి వెళ్లేదాన్ని. రోజుకు రూ.200 ఇచ్చేవారు. మా ఆయన ఆదాయానికి నా కూలి తోడవడంతో కొన్ని ఇబ్బందులు తొలిగిపోయాయి. మా వృత్తి చీరలు నేయడం. ఇంట్లో మగ్గం ఉన్నా నేయడానికి అవసరమైన పరికరాలు లేవు. వీటిని కొనుగోలు చేయాలంటే కనీసం రూ.30 వేలు ఉండాలి.
ముడి సరుకు కొనాలన్నా రూ.30 నుంచి 40 వేలు ఉండాలి. ఈ ప్రభుత్వం వచ్చాక నేతన్న నేస్తం కింద ప్రతి ఏటా రూ.24,000 మంజూరు చేస్తున్నారు. ఈ సొమ్ముతో మగ్గం పరికరాలు, ముడి సరుకులు సమకూర్చుకున్నాం. ఇంటి పనులయ్యాక తీరిక సమయంలో చీరలు నేస్తుంటాను. ఒక్కో చీరపై ఖర్చులు పోను రూ.400 నుంచి 500 వస్తుంది. పొదుపు సంఘంలో ఉండడంతో రూ.10 వేలు రుణం అందింది. అబ్బాయికి ఏటా అమ్మ ఒడి పథకం కింద రూ.15,000 పడుతోంది. దీంతో పిల్లాడి చదువు బెంగ తీరింది. ఈ ప్రభుత్వం అందించిన సహకారంతో నలుగురిలో గౌరవంగా బతుకుతున్నాం. – కామ్లె సరోజమ్మ, ఆదోని (ఇ.సుంకన్న, విలేకరి, ఆదోని)
నాకు ప్రాణభిక్ష పెట్టారు
మా అమ్మా నాన్నలు పాప, యల్లావుల శ్రీను.. బాపట్ల జిల్లా చినగంజాం మండలం పెదగంజాం పంచాయతీలోని పల్లెపాలెం గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. మేము ముగ్గురం అమ్మాయిలమే. నేను రెండో కుమార్తెను. 2022లో పదో తరగతి చదువుతున్న సమయంలో నాకు కాలేయ సంబంధిత వ్యాధి వచ్చింది. చదువు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. సకాలంలో వైద్యం చేయాలని, లేకుంటే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పారు.
మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో నాకు వచ్చిన వ్యాధి పరిస్థితిని వివరిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాం. సీఎం కార్యాలయం అధికారులు నాకు రూ.10 లక్షలు ముఖ్యమంత్రి తక్షణ సహాయ నిధి నుంచి మంజూరు చేశారు. హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో నాకు కాలేయానికి సంబంధించిన శస్త్ర చికిత్స నిర్వహించారు. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుపడింది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పుణ్యమా అని నేను సకాలంలో వైద్యం చేయించుకోగలిగాను.
నాకు ప్రాణభిక్ష పెట్టిన మావయ్యగా జగన్ ఎప్పటికీ నా మదిలో నిలిచిపోతారు. ప్రస్తుతం నేను ఉప్పుగుండూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాను. నాకు ప్రతి ఏటా అమ్మ ఒడి పథకం కింద నిధులు మంజూరయ్యాయి. మా అమ్మకు వైఎస్సార్ ఆసరా కింద డబ్బులు రావడంతో అప్పులు చేయకుండానే కుటుంబం గడుస్తోంది. పెదగంజాం జగనన్న కాలనీలో ఇంటి స్థలం కూడా ప్రభుత్వం కేటాయించింది. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – యల్లావుల మేఘన, పెదగంజాం (పల్లపోలు శ్రీనివాసరావు, విలేకరి, చినగంజాం)
నా షాపు ఆదాయం పెరిగింది
నేను బార్బర్ పని చేస్తుంటా. పార్వతీపురం పట్టణంలో ఓ చిన్న సెలూన్ షాపు పెట్టుకుని దానిపై వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడిని. గత టీడీపీ ప్రభుత్వం మా లాంటి కులవృత్తిదారుల కష్టాలు పట్టించుకునేది కాదు. కనీసం మా వైపు కన్నెత్తి చూసేది కాదు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక చేదోడు పథకం కింద ఏటా రూ.10 వేలు ఇస్తుండటంతో షాపును ఆధునికంగా తీర్చిదిద్దాను.
దీంతో కస్టమర్ల సంఖ్య పెరిగింది. ఆదాయం వస్తోంది. మా నాన్న కూర్మారావుకు వైఎస్సార్ పింఛన్ కానుక కింద నెలకు రూ.3 వేలు అందుతోంది. మా అమ్మ లక్ష్మమ్మకు వైఎస్సార్ చేయూత కింద ఏటా రూ.18,750 చొప్పున మూడు విడతల్లో 56,250 అందింది. అమ్మ పేరున జగనన్న కాలనీలో ఇంటి స్థలం మంజూరైంది. నిర్మాణానికి రూ.1.80 లక్షల సాయంతో పాటు నిర్మాణ సామగ్రిని రాయితీపై సమకూర్చింది. ఇసుక ఉచితంగా అందిస్తోంది. ఇదంతా జగనన్న దయ. ఆయనకు మా కుటుంబం రుణపడి ఉంటుంది. – అలజంగి రవికుమార్, పార్వతీపురం (ఆశపు జయంత్‌కుమార్, విలేకరి, పార్వతీపురం టౌన్)
Comments
Please login to add a commentAdd a comment