ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
ఆరోగ్యశ్రీ బతికించింది
ఒకరోజు ఒంట్లో బాగోలేదని ఆసుపత్రుల చుట్టూ తిరిగా. వైద్యులు క్యాన్సర్ అని చెప్పారు. నేను చదువుకోలేదు. వయస్సు మీదపడటం, నిరక్షరాస్యతతో ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. నా కుమారుడు ఏసుబాబు కూడా చదువుకోలేదు. స్థానిక ఏఎన్‌ఎం కౌసల్య ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందవచ్చని చెప్పారు. నా పేరు వాసిరెడ్డి సుబ్బాయమ్మ. మా ఊరు పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని చినకాపవరం. నేను, నా కొడుకు విజయవాడలోని క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లాం. ఆరోగ్య శ్రీ కార్డు ద్వారా వైద్యం చేస్తామని చెప్పారు.
వైద్యం ప్రారంభించి ఇప్పటికి ఆరుసార్లు కీమో థెరపీ చేశారు. ఏడోసారి ఫిబ్రవరి 15న రమ్మన్నారు. నేను పౌష్టికాహారం తినేందుకు రోజుకు రూ.250 చొప్పున నా బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం రూ.5 వేలు జమ చేసింది. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు మావి. నా భర్త చనిపోయాడు. కొడుకు కూలి పనికి వెళ్లి నన్ను పోషిస్తున్నాడు. మనవరాలికి అమ్మఒడి వస్తోంది. కోడలికి ఆసరా ద్వారా లబ్ధి కలిగింది. నాకు వితంతు పింఛన్ నెలకు రూ.3 వేలు వస్తోంది. ప్రస్తుతం ఆరోగ్యం కుదుట పడుతోంది. ఆరోగ్యశ్రీ నన్ను బతికించింది. పెద్ద కొడుకులా ఆదుకున్న సీఎం జగన్‌కు రుణపడి ఉంటాను. – వాసిరెడ్డి సుబ్బాయమ్మ, చినకాపవరం (బీఆర్ కోటేశ్వరరావు, విలేకరి, ఆకివీడు)
మలి వయసులో నడి‘పించెన్’
నా పేరు కుపిలి సూర్యారావు. మాది ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం యర్రమిల్లిపాడు. నాకు 74 సంవత్సరాలు. వ్యవసాయ కూలి పనులు చేసే నేను ఇప్పుడు ఏ పనులకూ వెళ్లలేకపోతున్నా. నా పిల్లల పెళ్లిళ్లు చేశాక ఎవరి దోవన వారు వెళ్లిపోయారు. మిగిలింది నేను, నా భార్య. ఇద్దరమూ ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నాం. నేను వైకల్యంతో కదల్లేని స్థితిలో ఉన్నా. ఈ తరుణంలో జగన్ ప్రభుత్వం రావడం మా అదృష్టమని చెప్పాలి. ప్రభుత్వం రావడంతోనే అమలు చేసిన నవరత్నాలు మాకు ఎంతో ఆసరా అయ్యాయి.
నేను, నా భార్య ప్రభుత్వం అందించే పథకాలతోనే బతుకుతున్నాం. నాకు డీఎంహెచ్‌ఓ పింఛన్ నెలకు రూ.5 వేలు వస్తోంది. నా భార్యకు వృద్ధాప్య పింఛను రూ.3 వేలు, అభయహస్తం పింఛను రూ.500 కలిపి మొత్తం ప్రతి నెలా రూ.8500 వస్తున్నాయి. వలంటీరు ఇంటికి తీసుకువచ్చి ఆ డబ్బు ఇస్తున్నారు. ఈ డబ్బుతోనే మేము జీవిస్తున్నాం. సీఎం జగన్‌కు ధన్యవాదాలు. మళ్లీ ఆయనే సీఎంగా రావాలి. – కుపిలి సూర్యారావు, యర్రమిల్లిపాడు (పాండ్రాకుల వెంకట పెద్దిరాజు, విలేకరి, ఉంగుటూరు)
మా ఆనందం చెప్పలేనిది
మేము కృష్ణా జిల్లా పెడన పట్టణంలోని ఏడో వార్డు వీరభద్రపురంలో ఉంటున్నాం. నా పేరు వాసా నాగలక్ష్మి. నేత కారి్మకురాలిని. నా భర్త పేరు శ్రీనివాసరావు. 30 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే జీవిస్తున్నాం. జగనన్న ప్రభుత్వం వచ్చాక నేతన్న నేస్తం పథకం కింద ఏటా రూ.24 వేల చొప్పున ఐదేళ్లు రూ.1.20 లక్షలు నేరుగా నా బ్యాంకు ఖాతాలో జమయ్యాయి.
మా అమ్మాయి పావన సాయి నాగ మల్లేశ్వరికి ఇంటర్మిడియట్‌లో అమ్మఒడి ద్వారా రూ.15 వేలు చొప్పున, డిగ్రీలో విద్యాదీవెన కింద రూ.35 వేల వరకు వచ్చాయి. నాకు ఆసరా కింద ఏటా రూ.16,300 చొప్పున వచ్చింది. పట్టణంలోని పల్లోటి లే అవుట్–1లో ఇంటి పట్టా ఇచ్చారు. రూ.1.80 లక్షలతో ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేసుకున్నాం. త్వరలో గృహ ప్రవేశం చేసి ఆ ఇంట్లోకి వెళ్లడానికి ముహూర్తం చూస్తున్నాం.
నాకు ప్రమాదం జరిగి చేయి విరిగితే ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయించుకున్నా. ఆ సమయంలో రూ.35 వేలు ఖర్చయింది. దానిని ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రికి చెల్లించింది. విశ్రాంతి సమయంలో కూడా ఆరోగ్య ఆసరా కింద రెండు నెలలకు రూ.10 వేలు ఇచ్చారు. మా ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయి. చాలా సంతోషంగా ఉన్నాం. జగనన్నకు కృతజ్ఞతలు. మళ్లీ ఆయనే రావాలి. – వాసా నాగలక్ష్మి, పెడన (ఎన్.గంగాధరరావు, విలేకరి, పెడన)
Comments
Please login to add a commentAdd a comment