ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
అప్పు చేయాల్సిన అవసరమే లేదు
మా కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తోంది. నాకు ఒకటిన్నర ఎకరాల పొలం ఉంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం యరకన్నపాలెంలోని మా పొలాల పక్కనే తాండవ జలాశయం కాలువ పారుతుండటంతో నీటికి ఇబ్బంది లేదు. నీటి వసతి ఉండటంతో ఏటా వరి పంట వేస్తుంటాం. 30 సెంట్లలో జీడిమామిడి తోట ఉంది. మిగిలిన ఎకరా 20 సెంట్లలో వరి పంట వేశాను. జీడి తోట సంవరక్షణ, వరికి నాట్ల దగ్గర నుంచి కోతకోసే వరకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఖర్చవుతుంది.
ఈ ప్రభుత్వం రాకమునుపు వ్యవసాయ పెట్టుబడికి అప్పుచేయాల్సి వచ్చేది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున వస్తుండటంతో పెట్టుబడికి ఇబ్బంది లేదు. వరి పంట కోత దశకు వచ్చింది. ఈ సమయంలో రైతు భరోసా కింద రూ. 4 వేలు పడింది. ఈ డబ్బు కోత పనులకు ఉపయోగపడుతుంది. నా భార్య రామలక్ష్మి కి వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.13 వేలు వచ్చింది. గుంటూరు ప్రైవేటు కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న నా కుమారుడు ప్రవీణ్‌కుమార్‌కు జగనన్న విద్యా దీవెన ద్వారా ఏటా రూ.55 వేల వంతున వచ్చింది.
గుడ్ల వల్లేరు ఏఏఎన్‌ఎం కాలేజీలో డిప్లమా ఫైనల్ ఇయర్ చదువుతున్న మా అమ్మాయి శ్రావణికి ఏటా రూ.25 వేల వంతున వచ్చింది. జగనన్న ప్రభుత్వంలో పైసా ఖర్చు లేకుండా ఇద్దరు బిడ్డలను ప్రైవేటు కళాశాలలో చదివించుకుంటున్నాను. అప్పు కోసం తిరగాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఈ ప్రభుత్వంలో జరిగిన మేలు మరువలేను. – రుత్తల సాంబశివరావు, రైతు, యరకన్నపాలెం (ఏనుకూరి అప్పారావు, విలేకరి, నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా)
సొంతిల్లు కల్పించిన జగనే మా దేవుడు
మా సొంతూరు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు. ఆర్‌ఎంపీగా జీవనం సాగిస్తున్నాను. 26 ఏళ్ల కిందట ఉపాధి కోసం అనంతపురం జిల్లాకు వలస వచ్చా. నాకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఉరవకొండ, విడపనకల్లు, అనంతపురం రూరల్ మండలం కందుకూరు తదితర ప్రాంతాల్లో పనిచేశా. ప్రస్తుతం కందుకూరు గ్రామంలో స్థిరపడ్డా. పిల్లలు పెద్దయ్యేకొద్ది ఖర్చులు పెరుగుతూ వచ్చాయి. వచ్చే సంపాదనంతా ఇంటి అద్దెలు, కుటుంబ నిర్వహణకే సరిపోయేది. సొంతగూడు కట్టుకోవాలని కలలు కనేవాడిని. ప్రతీరోజూ ఆ దేవుడ్ని మొక్కుకునేవాడిని. బాడుగ డబ్బు చెల్లించడంలో కాస్తా ఆలస్యమైతే చాలు ఇల్లు ఖాళీ చేయమనేవారు.
ఇంతకుముందు ఎక్కడా అరసెంటు కూడా లబ్ధి పొందలేదు. మహానుభావుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత కందుకూరు జగనన్న లే అవుట్‌లో సెంటున్నర స్థలం ఇచ్చారు. ప్రస్తుతం ఈ స్థలం విలువ రూ.5 లక్షల దాకా ఉంది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు మంజూరు చేయడంతో ఇల్లుకూడా నిర్మించుకున్నా. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసేశా. నా కొడుకుకు సచివాలయ ఉద్యోగం వచ్చింది. ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా అనంతపురంలో పనిచేస్తున్నాడు. ఇంతకంటే ఇంకేమి కావాలి? అందుకే నా ఇంట్లో దేవుని గూటిలో మా నాయన ఫొటో పెట్టుకోలేదు కాని వైఎస్ జగన్ ఫొటో పెట్టుకుని పూజిస్తున్నా. – సీహెచ్ గోవిందరెడ్డి, కందుకూరు (రిపోర్టర్: బొడ్డు నగేష్, అనంతపురం ఎడ్యుకేషన్)
వృద్ధాప్యంలో ఈ ప్రభుత్వమే పోషిస్తోంది
నేను వృద్ధురాలిని..ఒంటరి మహిళను. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బాపులపాడులో వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాను. రెక్కాడితే కాని డొక్కాడని జీవితం నాది. వయోభారంతో కూలీ పనులు చేసే ఓపిక లేకపోవటంతో బతుకు భారంగా మారింది. ఆదాయం లేకపోవటంతో డ్వాక్రా గ్రూపు ద్వారా తీసుకున్న బ్యాంకు రుణం చెల్లించటం కష్టంగా మారింది. ఇలాంటి తరుణంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నన్ను భగవంతుడిలా ఆదుకుంది. ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మనోధైర్యాన్ని ఇచ్చాయి. వైఎస్సార్ చేయూత, ఆసరా, రైతు భరోసా, వైఎస్సార్ ఫించన్ కానుక పథకాలతో పెద్ద కొడుకుగా జగన్ నన్ను ఆదుకున్నాడు.
వృద్ధాప్య ఫించన్‌తో పాటు ఏటా నాలుగు సంక్షేమ పథకాల ద్వారా బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతోంది. ప్రతి నెల ఒకటో తేదీనే వలంటీర్ ఇంటికి వచ్చి నాకు రూ.3 వేలు వృద్దాప్య పింఛన్ అందిస్తున్నారు. ఆసరా పథకం క్రింద రూ.30 వేలు డ్వాక్రా రుణమాఫీ చేశారు. వైఎస్సార్ చేయూత కింద ఏటా రూ.18,750, రైతు భరోసా కింద ఏటా రూ.13,500 అందుతున్నాయి.
దీంతో ఎవ్వరిపైనా ఆధార పడకుండా ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తున్నాను. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు నెలకు సరిపడా అందిస్తున్నారు. జగనన్న రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. – జోగి లక్ష్మి, బాపులపాడు చలమలశెట్టి శ్యామ్, విలేకరి, హనుమాన్‌జంక్షన్
Comments
Please login to add a commentAdd a comment