ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
సొంతింటి కల నెరవేరింది
నా భర్త 30 ఏళ్ల క్రితమే వదిలేశాడు. విశాఖ పట్నంలోని 89వ వార్డు నాగేంద్ర కాలనీలో ఉంటున్న అక్క ఇంటి వద్దే నివసిస్తున్నాను. మా అక్కకు చిన్న టీ దుకాణం ఉంది. అక్కడే పని చేస్తూ జీవిస్తున్నా. నాకు ఒక పాప. పాపను త్రిబుల్ ఐటీ చదివించాను. ఇపుడు ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. గత ప్రభుత్వంలో నాకు ఏ ప్రయోజనం అందలేదు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒంటరి మహిళ పింఛను రూ.3,000 వస్తోంది. చేయూత ద్వారా రూ.18,750 అందుకున్నా. ఇప్పుడు నాకు ఇంటి స్థలం వచ్చింది. ఇంటి నిర్మాణం జరుగుతోంది. ఆ ఇంటి విలువ సుమారు రూ.35 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. నా ఇంటి కల జగనన్న వల్లే నెరవేరింది. – షేక్ అన్నపూర్ణ, నాగేంద్ర కాలనీ 89వ వార్డు, విశాఖపట్నం సిటీ (చింతాడ వెంకటరమణ, విలేకరి, గోపాలపట్నం)
మా బతుకులకు చింతలేదు
మాది అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం డి.పోలవరప్పాడు. మా గ్రామంలో మాకు కొద్దిపాటి భూమి ఉంది. కడుపు నింపుకోవడానికి నా భార్య రామయ్యమ్మతో కలిసి కూలి పనుల కోసం వలస వెళ్లేవాళ్లం. వచ్చిన సొమ్ముతో కుటుంబ పోషణ జరిగేది. జగనన్న ప్రభుత్వం వచ్చాక మా పేద కుటుంబాన్ని నవరత్నాల పథకాలు ఎంతో ఆదుకున్నాయి. రైతు భరోసా కింద ఏటా నాకు అందిన రూ.13,500 సొమ్మును జీడి మామిడి తోట సాగుకు ఉపయోగించా. దిగుబడి బాగుండడంతో అప్పులు తీర్చేశా.
దీంతో పాటు నాకు ప్రతి నెలా వైఎస్సార్ పింఛన్ వస్తోంది. నా భార్య డ్వాక్రా గ్రూపు సభ్యురాలు. ఆమెకు చేయూత పథకం కింద నాలుగు విడతల్లో రూ.75,000 జమయింది. నా కుమార్తె సావిత్రి నాలుగో తరగతి చదువుతోంది. ఏటా అమ్మఒడి సొమ్ము వచ్చింది. నా బిడ్డకు జగనన్న విద్యా కానుక ద్వారా పుస్తకాలు, బ్యాగులు, షూ తదితర సామగ్రి అందుతోంది. సీఎం జగనన్న వల్ల మా కుటుంబానికి కలిగిన మేలు ఎప్పటికీ మరిచిపోం. మా బతుకులకు ఎటువంటి చింతా లేదు. మళ్లీ ఆయనే సీఎంగా రావాలి.
– వంతల బిరసయ్య, డి.పోలవరప్పాడు (సింగిరెడ్డి శ్రీనివాసరావు, విలేకరి, అడ్డతీగల)
కూలి పని మానేసి వెల్డింగ్ షాపు పెట్టుకున్నా
మాది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి. షాపులో కూలిగా పని చేసుకునే నేను సొంతంగా షాపు పెట్టుకునే స్థాయికి ఎదిగాను. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల పుణ్యమే. ఏడో తరగతి వరకూ చదువుకున్న నేను 2019 వరకు ఒక వెల్డింగ్ షాపులో రోజువారీ కూలీగా పనిచేశా. నాకు భార్య, ముగ్గురు పిల్లలు. డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా ఉన్న నా భార్య నాగ వెంకట జ్యోతికి రూ.70 వేల రుణం మంజూరైంది. ఆ సొమ్ముతోపాటు మరికొంత జత చేసి మా ఊళ్లోనే గీతిక వెల్డింగ్ షాపు పేరుతో సొంతంగా పనులు చేయడం ప్రారంభించా.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాల ద్వారా మా కుటుంబానికి చేకూరిన రూ.36 వేలు, సున్నా వడ్డీ ద్వారా వచ్చిన రూ.5,028.. షాపు నడపడానికి అవసరమైన పెట్టుబడిని సమకూర్చాయి. ఆ తర్వాత జగనన్న కాలనీలో ఇంటి స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం మంజూరైంది. ఇంటి స్థలం విలువతో కలిపి జగనన్న ప్రభుత్వ హయాంలో నాకు మొత్తం రూ.5.47 లక్షల మేర ప్రయోజనం చేకూరింది. – గారపాటి నాగరాజు, తేతలి (కె.కృష్ణ, విలేకరి, తణుకు టౌన్)
Comments
Please login to add a commentAdd a comment