ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
ధైర్యంగా బతకగలుగుతున్నా
మా ఆయన తిక్కస్వామి వ్యవసాయ కూలీ. ఆయన సంపాదనతోనే కర్నూలు జిల్లా పెద్దతుంబళం గ్రామంలో ఒడుదొడుకులతో సంసారం సాగేది. పనిలేనిరోజు పస్తులుండాల్సి వచ్చేది. పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. మాకు ఒక కుమార్తె, కుమారుడు సంతానం. భర్త మరణంతో కుటుంబ పోషణ చాలా భారమైంది. గత ప్రభుత్వంలో మాకు ఎలాంటి సాయం అందలేదు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మా కుటుంబానికి ఆసరా దొరికినట్టయింది. రూ. 30 వేలు పొదుపు రుణం సున్నావడ్డీ కింద తీసుకుని కుట్టుమెషీన్ కొనుక్కున్నా. నాకు వితంతు పింఛను కూడా వస్తోంది. మా ఇద్దరు పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు. ఒకరికి అమ్మ ఒడి కింద రూ.15వేలు అందుతోంది. బడిలో మంచి ఆహారం, అవసరమైన పుస్తకాలు, యూనిఫాం వంటివి అందిస్తున్నారు. జగనన్న కాలనీలో ఇంటి స్థలం కూడా మంజూరైంది. ఎలాంటి భయం లేకుండా బతుకుతున్నానంటే జగనన్న ఆశీర్వాదమే కారణం. – బయటిగేరి రాజేశ్వరి, పెద్దతుంబళం (కపటి రామచంద్ర, విలేకరి, ఆదోని రూరల్)
సాయం చేసి.. ఉపాధి బాట వేసి..
నా భర్త ఏలేటి కిరణ్‌తోపాటు నేను కూడా అద్దె ఆటో నడుపుతూ రాజమహేంద్రవరం మండలం కొంతమూరులో ఇద్దరు మగ పిల్లలను పోషించుకుంటూ జీవిస్తున్నాం. అద్దె ఆటో కన్నా సొంత ఆటో కొనుగోలు చేయాలనుకున్నాం. ధర కనుక్కుంటే రూ.4.50 లక్షల వరకూ అవుతుందని తెలిసింది. అంత సొమ్ము భరించలేమని భయపడ్డాం. ఆ సమయంలో సీఎం జగనన్న ‘ఉన్నత మహిళా శక్తి’ పథకం ద్వారా ఉపాధికి భరోసా కల్పించారు. ఎటువంటి వడ్డీ లేకుండా రూ.2.79 లక్షల విలువైన ఆటోను ప్రభుత్వం అందించింది. దీంతో మా కుటుంబం కుదుటపడింది.
అంతేగాకుండా ఇంటి స్థలాన్ని మంజూరు చేసి పట్టా అందించారు. ఇద్దరు మగ పిల్లల్లో ఏలేటి సంజయ్ సాత్విక్ ఐదో తరగతి, ఏలేటి సంజయ్ సంపత్ మూడో తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఇద్దరిలో చిన్నవాడికి అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేలు వస్తోంది. అంతేకాకుండా వైఎస్సార్ విద్యా కానుక ద్వారా పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగ్‌లు, షూలు, సాక్సులు సైతం అందించారు. జగనన్న గోరుముద్ద ద్వారా మధ్యాహ్నం పౌష్టికాహారమైన భోజనాన్ని పెడుతున్నారు. సీఎం జగనన్న ద్వారా జరిగిన మేలు మా కుటుంబం మరచిపోదు. జీవితాంతం రుణపడి ఉంటాం. – ఏలేటి దేవీదుర్గ, ఆటో డ్రైవర్ కొంతమూరు (యెనుముల విశ్వనాథం, విలేకరి, రాజమహేంద్రవరం రూరల్)
పోతాయనుకున్న ప్రాణాలు నిలిపారు
దుకాణాల్లోనూ, ఇళ్లలోనూ ధూపం వేస్తూ, దిష్టి తాళ్లు కడుతూ పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో జీవించే కుటుంబం మాది. జిల్లాలో కోవిడ్ బారిన పడిన మొదటి వరుసలోని వ్యక్తిని. దాంతో మేమంతా తీవ్ర భయభ్రాంతులకు గురై, తీవ్ర మానసిక వేదన అనుభవించాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖర్చుకు వెరవకుండా అండగా నిలిచి ప్రాణాలు నిలిపారు. ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించి 16 రోజుల పాటు వైద్యం చేయించారు. రెండు పూటలా పౌష్టికాహారం అందించడంతోపాటు ఉదయం, సాయంత్రం టిఫిన్ ఇచ్చారు.
సమయానికి మందులు ఇచ్చి ప్రాణాలకు అండగా నిలిచారు. భయభ్రాంతుల నుంచి నేడు సాధారణ జీవితంలోకి వచ్చి మళ్లీ జీవనోపాధిలో ముందుకు సాగడం అంతా సీఎం జగన్ చలవే. అంతేగాకుండా మా కుటుంబానికి అమ్మఒడి ద్వారా ఏడాదికి రూ. 15వేలు, నా భార్యకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రూ.36 వేలు లబ్ధి చేకూరింది. సీఎంకు మా కుటుంబం అంతా రుణపడి ఉంటుంది. – షేక్ ఖాసీం, పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా (గుర్రాల శ్రీనివాసరావు, పెనుగొండ, పశ్చిమగోదావరి జిల్లా)
Comments
Please login to add a commentAdd a comment