ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
పుట్టింటి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంది
నాకు 2010లో వివాహమైంది. అప్పటి నుంచి చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం నడింపల్లెలో భర్త మంజునాథ్‌తో కలసి వ్యవసాయ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తుండేవాళ్లం. మాకు ఇద్దరు పిల్లలు. చిన్నోడు కడుపులో ఉండగానే 2020లో నా భర్త అనారోగ్యం బారిన పడ్డాడు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించినా ఆయనను కాపాడుకోలేకపోయాను. ఒక్కసారిగా నా జీవితం మొత్తం చీకటిగా మారిపోయింది. చిన్న పిల్లలతో ఎలా బతకాలో తెలియని అయోమయంలో పడ్డాను.
బతకడానికి ఎన్ని పాట్లు పడాలోనని ఆందోళన చెందాను. అదృష్టవశాత్తు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చింది.అప్పటి నుంచి నా సమస్యలన్నీ పరిష్కారమైపోయాయి. ముఖ్యంగా నా భర్త మరణంతో బీమా రూ.2 లక్షలు నా బ్యాంకు అకౌంటులో వేశారు. కూలి పనులు చేస్తూ బిడ్డలను పోషించుకుంటున్న నాకు ప్రతి నెలా వితంతు పింఛన్ ఇస్తున్నారు. జగనన్న కాలనీలో ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చారు. ఇంటి నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది.
ఆరో తరగతి చదువుతున్న పెద్ద కొడుకు చరణ్‌కుమార్‌కు అమ్మఒడి పథకం కింద ఏటా రూ. 15 వేలు వంతున వస్తోంది. అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తున్న చిన్నోడు భరత్ పోషణ ప్రభుత్వమే చూస్తోంది. గత ఐదేళ్లలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో నా కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.8 లక్షలకు పైగానే వచ్చింది. అనుకోని కష్టం వచ్చిన ఆడబిడ్డను పుట్టింటి వారికన్నా గొప్పగా ఈ ప్రభుత్వం ఆదుకుంది. జన్మజన్మలకీ మా జగనన్న మేలు మరువలేను. – చిన్నమ్మయ్య, నడింపల్లె (ఎస్.జి. హరినాథ్, విలేకరి, శాంతిపురం)
మా ‘ఇంటి’వేల్పు జగనన్న
మాది చాలా పేద కుటుంబం. పశి్చమగోదావరి జిల్లా ఉండి మండలంలోని యండగండి గ్రామంలో నేను ఆటో నడుపుతూ భార్య మాధవి, కుమార్తె శ్రావణి, కుమారుడు దావీదురాజును పోషించుకుంటున్నా. అన్ని రోజులూ గిరాకీ ఉండేది కాదు. వచ్చినపుడు ఏదోలా బతుకు సాగినా... గిరాకీ లేనినాడు నానా తిప్పలూ పడాల్సి వచ్చేది. ఆటోకి ఏదైనా మరమ్మతు వస్తే దానిని బాగు చేయించేందుకు అప్పులు చేయాల్సి వచ్చేది. దానిని తీర్చడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాను. కానీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక మా జీవితం మారిపోయింది. నాకు వాహనమిత్ర పథకం ద్వారా ఏటా రూ.పది వేలు అందుతోంది.
మా పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదువుతున్నారు. అమ్మాయికి అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ. 15 వేలు వస్తోంది. పిల్లలిద్దరికీ విద్యా కానుక ద్వారా ఉచిత పుస్తకాలు, బూట్లు, బెల్టు, టై అందుతున్నాయి. పాఠశాలలో జగనన్న గోరుముద్ద ద్వారా మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. మాకు ఇల్లు కట్టుకోవడమనేది ఓ కల. ఆటో నడిపే నేను ఇంటి స్థలం ఎలా కొనాలి అనుకునేవాడిని. కానీ జగనన్న ప్రభుత్వం ఇంటి స్థలం నా భార్య పేరుతో ఇవ్వడమే గాకుండా ఇల్లు కట్టుకునేందుకు రూ.1.80 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు నేను సొంత ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు అద్దె బాధ తప్పింది. మా ఇంట ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు. మాకు ఇంతకంటే ఏం కావాలి.. మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలి. – ఎలకపల్లి శ్రీను, యండగండి (చాలంటి రత్నరాజు, విలేకరి, ఉండి)
బతుకు బెంగ తీరింది
బార్బర్ వృత్తి మాది. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి గ్రామంలో సెలూన్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నా. నాతో పాటు భార్య నాగరత్నమ్మ, కుమారుడు జగదీష్ ఉంటున్నారు. సెలూన్‌పై వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబం మొత్తం గడవాలి. అన్ని రోజులూ ఒకేలా ఉండేవి కాదు. ఆదాయమే లేకుంటే బతకడానికి అప్పులు చేయాల్సి వచ్చేది. రోజొక గండంగా గడిచేది. కానీ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక మా కుటుంబ సమస్యలన్నీ తీరిపోయాయి. బతకడానికి ఎలాంటి బెంగ లేకుండా పోయింది. జగనన్న చేదోడు పథకం కింద నాకు ప్రతి సంవత్సరం రూ.10 వేలు అందుతోంది.
ఈ మొత్తంతో సెలూన్ షాపునకు అవసరమైన సామగ్రి తెచ్చుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా కుల వృత్తి చేసుకుంటున్నాను. గతంలో మాకు సొంతిల్లు లేక బాడుగ ఇళ్లలో ఉంటూ ఎన్నో కష్టాలు పడ్డాం. ఈ ప్రభుత్వం మాకు ఇంటి స్థలం మంజూరు చేసింది. రూ.1.80 లక్షల సాయం అందించటంతో సొంతిల్లు నిర్మించుకున్నాం. నా భార్యకు వైఎస్సార్ చేయూత పథకం కింద ఏటా రూ.18,750 అందుతోంది. ఇంటర్మిడియట్ చదువుతున్న నా కుమారుడికి ఏటా రూ.15 వేలు వంతున ‘అమ్మఒడి’ వస్తోంది. ఈ విధంగా మాలాంటి పేదవాళ్ల కోసం అనేక మంచి పథకాలు అమలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా. – బి.ఆంజనేయులు, మామిళ్లపల్లి (వై.మహదేవరెడ్డి, విలేకరి, కనగానపల్లి)
Comments
Please login to add a commentAdd a comment