శుభకార్యాల్లో అతిథులకు కొసరికొసరి వడ్డించె ఆ బతుకులపై విధి పగబట్టిందో ఏమో.. పనిముగించుకుని ఆటోలో సొంతూరుకు తిరుగుపయనమైన బడుగు జీవులపై కన్నెర్ర చేసింది. రోజంతా తీరకలేని పనిభారంతో అలసిసొలసిన తనువులు కాస్త విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు పంజా విసిరింది. నిశ్శబ్ద నిశీధిలో విషాద గీతిక ఆలపించింది. ఆర్తనాదాలు, హాహాకారాలతో వికటాట్టహాసం చేసింది. ఐదు ప్రాణాలను చీకటి తెరతోపాటే గాలిలో కలిపేసింది. ఆ కుటుంబాలకు పెనుదుఃఖాన్ని మిగిల్చింది. ఈ హృదయ విదారక ఘటన ఆదివారం తెల్లవారుజామున బాపట్ల జిల్లా సంతమాగులూరు వద్ద జరిగింది.
నరసరావుపేటటౌన్: గుంటూరుకు చెందిన చెలిమెళ్ల కవిత(19), పల్తం నారీనాయక్(22), బుర్రి మాధవి(35), అలివేలు మంగతాయారు(24), తమ్మిశెట్టి తులసి(16), సలికండి విజేత క్యాటరింగ్ పనులు చేస్తుంటారు. మార్కాపురంలోని సెవెన్ హిల్స్ కల్యాణ మండపంలో నిర్వహించే పెళ్లిలో పనిచేసేందుకు ఒప్పుకున్నారు. ఆరుగురూ కలిసి గుంటూరుకు చెందిన పల్తం రాజునాయక్ ఆటోను బాడుగకు మాట్లాడుకుని శనివారం ఉదయం వెళ్లారు. అక్కడ పని ముగించుకొని తిరిగి అర్ధరాత్రి 12 గంటలకు గుంటూరు బయలుదేరారు.
అప్పటికే అలసిసొలసి ఉండడంతో ఆటోలో విశ్రాంతి తీసుకున్నారు. మార్గమధ్యలో ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు బాపట్ల జిల్లా సంతమాగులూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్దకు వచ్చేసరికి ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ దుర్ఘటనలో చెలిమెళ్ల కవిత, పల్తం నారీనాయక్, బుర్రి మాధవి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మిగిలిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 సహాయంతో నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అలివేలు మంగతాయారు, తమ్మిశెట్టి తులసి మరణించారు. ఆటో డ్రైవర్ రాజునాయక్ పరిస్థితి విషమంగా ఉంది. అతడిని మెరుగైన వైద్యసేవల కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనాస్థలాన్ని బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు.
వైద్యశాల వద్ద హాహాకారాలు
ప్రమాదంలో మృతి చెందిన ఐదు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుల బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో వైద్యశాల వద్దకు చేరుకున్నారు. కుంటుంబ సభ్యుల రోదనలతో వైద్యశాల మిన్నంటింది.
మృతదేహాలను పరిశీలించిన ఆర్డీఓ, డీఎస్పీ
ఏరియా వైద్యశాలలో మృతదేహాలను బాపట్ల డీఎస్పీ టి.వెంకటేశ్వర్లు, చీరాల ఆర్డీఓ సరోజని పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సంతమాగులూరు సీఐ ప్రభాకర్, సంతమాగులూరు తహసీల్దార్ ప్రశాంతి ఆధ్వర్యంలో మృతదేహాలకు శవపంచనామా నిర్వహించారు. వైద్యులు పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
అన్నీ రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులే..
గుంటూరు ఈస్ట్: సంతమాగులూరు వద్ద జరిగిన ప్రమాదంలో మరణించిన తులసి, అలివేలు మంగతాయారు, కవిత, నారీనాయక్ కుటుంబాలవి రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులే. వీరు పొట్టకూటి కోసం ఎక్కడ పని ఉంటే అక్కడకు వెళ్లి నాలుగురాళ్లు తెచ్చుకుని జీవిస్తున్నారు.
● నల్లచెరువు 3వ లైనుకు చెందిన చెలిమెల్ల ఆంజనేయులు కుమార్తె కవిత, గుంటూరు నగరానికి చెందిన పి.సకూర్ నాయక్ కుమారుడు నారీ నాయక్ ఇద్దరూ క్యాటరింగ్ పనులు చేస్తూ కుటుంబాలకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో వారు మరణించడంతో ఆ కుటుంబాలు గుండెలవిసేలా రోదిస్తున్నాయి.
● నల్లచెరువు 3వ లైనుకు చెందిన తమ్మిశెట్టి వీరాస్వామికి ముగ్గురు కుమార్తెలు. వీరంతా క్యాటరింగ్ పనులకు వెళ్తారు. మూడో కుమార్తె తులసి 9వ తరగతి వరకు చదివి మానేసింది. క్యాటరింగ్ పనులకు వెళ్తుంది. శనివారం తోటి కార్మికులతో కలిసి పనికి వెళ్లి ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
● నల్లచెరువు 1వ లైనుకు చెందిన శివశంకర్, అతని భార్య అలివేలు మంగతాయారు చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈమె కూడా శనివారం క్యాటరింగ్ పనులకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో మరణించింది. దీంతో భర్త శివశంకర్ తీవ్రంగా విలపిస్తున్నారు.
అమ్మ లేదని పిల్లలు విలవిల
గుంటూరు రూరల్: గోరంట్ల గ్రామానికి చెందిన బుర్రి మాధవి, ఆమె భర్త రమేష్ ఇద్దరూ రెక్కల కష్టంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. చిన్నకుమార్తె 7వ తరగతి, పెద్దకుమార్తె 10వ తరగతి స్థానిక పాఠశాలలోనే చదువుతున్నారు. శనివారం తోటి కార్మికులతో కలిసి క్యాటరింగ్ పనులకు వెళ్లిన మాధవి తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో మరణించడంతో భర్త, ఇద్దరు ఆడపిల్లలు హతాశులయ్యారు. అమ్మ మరణంతో పిల్లలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే రమేష్ ఘటనాస్థలికి వెళ్లారు. కాయకష్టంతో ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నామని, ఇంతలో విధి పగబట్టిందని తీవ్రంగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment