బాపట్ల: ఇద్దరూ ప్రాణస్నేహితులు.. ఒకే కాలేజీలో డిప్లమో పూర్తిచేశారు. ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలని కలలుగన్నారు. ఇంజినీరింగ్‌లో చేరడం కోసం ఒకే ద్విచక్రవాహనంపై కళాశాలకు నవ్వుతూ.. తుళ్లుతూ.. వెళ్తుండగా లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఆ యువకుల ఆశలను ఆవిరిచేసింది. నిండు ప్రాణాలను బలితీసుకుంది. రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.
ఈ హృదయ విదారక ఘటన వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం బైపాస్ జంక్షన్ వద్ద మంగళవారం జరిగింది. బాపట్ల మండలం ఇమ్మిడిశెట్టిపాలేనికి చెందిన ఇమ్మిడిశెట్టి అజయ్ (19), వేటపాలెం మండలం దేశాయిపేటకు చెందిన గౌరి సూర్యతేజ (19) ఇద్దరూ చల్లారెడ్డిపాలెం ప్రాంతంలోని ఇంజినీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ వరకు చదువుకున్నారు. వీరిద్దరూ ఇంజినీరింగ్‌లో చేరడం కోసం అదే కళాశాలలో సర్టిఫికెట్‌లు ఇవ్వడానికి దేశాయిపేట నుంచి మంగళవారం బైక్‌పై బయలుదేరారు. దేశాయిపేట నుంచి సర్వీస్ రోడ్డు మీదుగా చల్లారెడ్డిపాలెం వద్ద గల బైపాస్ రోడ్డు మీదకు చేరుకున్నారు.
అదే సమయంలో ఒంగోలు వైపు నుంచి అతి వేగంగా వస్తున్న కోళ్ల లారీ బైక్‌ని ఢీకొట్టింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరూ రోడ్డుపై ఎగిరిపడి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. లారీ డ్రైవర్, లారీలో ప్రయాణిస్తున్న మరో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న చీరాల రూరల్ సీఐ మల్లికార్జునరావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.
ఏడాది వ్యవధిలో కూతురు, కొడుకు దూరం
దేశాయిపేటకు చెందిన గౌరి రవికుమార్‌కు కుమారుడు సూర్యతేజతోపాటు కూతురు సువర్ణకమల ఉండేది. 2022 సెప్టెంబర్ 26న అనుజ్ఞా హైస్కూల్ విద్యార్థులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన కూతురు చింతూరు మండలం సోకిలేరు వాగు వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందింది. కూతురిని పోగొట్టుకొని ఏడాది తిరగకముందే కుమారుడు సూర్యతేజ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన వెంకటేష్..
వైఎస్సార్ సీపీ చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రెండు కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై రూరల్ సీఐని ఆరా తీశారు. బైపాస్‌లో ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment