మృతురాలు కృష్ణవేణి
బాపట్ల టౌన్: వివాహితను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నాలు వికటించాయి. పోలీసుల రంగప్రవేశంతో నిందితులు అరెస్ట్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. బాపట్ల మండలం, నందిరాజుతోట గ్రామానికి చెందిన జొన్న గోపయ్యకు మూడు సంవత్సరాల కిందట కర్లపాలెం మండలం, యాజలి గ్రామానికి చెందిన ఉప్పాల కృష్ణవేణి (21)తో వివాహం జరిగింది. వీరికి ఏడాది వయస్సున్న లోహిత అనే పాప ఉంది. ప్రస్తుతం కృష్ణవేణి గర్భవతిగా ఉంది.
వివాహేతర సంబంధమే కారణమా?
మృతురాలు కృష్ణవేణి భర్త జొన్న గోపయ్య హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్ట్‌లో హోటల్‌లో పని చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కృష్ణవేణి నందిరాజుతోటలోని అత్తారింట్లో ఉంటోంది. అదే గ్రామానికి చెందిన వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై గతంలో రెండు, మూడు పర్యాయాలు అత్తమామలు మందలించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయాన్ని ఇటీవల మృతురాలి కుటుంబసభ్యుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి మృతురాలు రహస్యంగా ఫోన్ మాట్లాడుతున్న విషయాన్ని గమనించిన ఆమె మరిది జొన్న శివబాబు ఈ విషయాన్ని భర్త గోపయ్యతో చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన అన్నదమ్ములు గురువారం రాత్రి మృతురాలిని తీవ్రంగా కొట్టి హత్యచేశారు.
ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం
మృతురాలి భర్త, ఆమె మామ, ఆమె మరిది ఈ విషయం బయటకు పొక్కకుండా ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా బాత్‌రూమ్‌లో ఉరి వేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. సంఘటన జరిగిన గంటల వ్యవధిలో గురువారం రాత్రే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న వాస్తవాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ
బాపట్ల డీఎస్పీ టి.వెంకటేశులు శుక్రవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికులతో మాట్లాడి వాస్తవాలను సేకరించారు. హత్యకు గురైన విషయం నిర్ధారణకు వచ్చిన తర్వాత మృతురాలి కుటుంబసభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ముగ్గురిపై కేసు నమోదు
కృష్ణవేణి హత్యకు కారకులైన ఆమె భర్త జొన్న గోపయ్య, మామ భిక్షాలు, మరిది శివబాబులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ కె. వెంకటప్రసాద్ తెలిపారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
కుమార్తెను చంపి బాత్‌రూమ్‌లో ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని, గత కొంతకాలం నుంచి ఆమెను చిత్రహింసలకు గురి చేస్తున్నారని మృతురాలి తల్లి సుజాత ఆరోపించింది. గురువారం రాత్రి తన కళ్ల ముందే చితకబాదారని, అడ్డువెళ్లినందుకు తనను కూడా తీవ్రంగా కొట్టారంటూ వాపోయింది. తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ శుక్రవారం సుమారు 50 మంది మహిళలతో రూరల్‌పోలీస్ స్టేషన్‌ముందు బైఠాయించారు. డీఎస్పీ హామీతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment