బాపట్లటౌన్: తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి వేగేశన నరేంద్రవర్మ, అతని తనయుడు రాకేష్ వర్మలపై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాపట్ల మండలం కంకటపాలెం గ్రామానికి చెందిన మద్దిబోయిన రాంబాబు 20 సంవత్సరాలుగా టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. 2019 ఎన్నికల్లో రాంబాబు తన తల్లి వెంకటరత్నంను బాపట్ల మండల జెడ్పీటీసీ సభ్యురాలిగా టీడీపీ తరపున పోటీ చేయించి ఆర్థికంగా నష్టపోయాడు. అయినప్పటికీ పార్టీపై ఉన్న మమకారంతో క్రియాశీలక కార్యకర్తగా కొనసాగుతున్నాడు.
ఈ క్రమంలోనే గతేడాది డిసెంబరులో చంద్రబాబు నాయుడు బాపట్ల వచ్చిన సందర్భంగా స్టేజి, డెకరేషన్, లైటింగ్ వేసినందుకు, ఇటీవల బాపట్లలో నిర్వహించిన మినిమహానాడుకు స్టేజి, డేకరేషన్, లైటింగ్, ఈనెల 8న చంద్రబాబునాయుడు బాపట్ల వచ్చిన సందర్భంగా స్టేజి, డెకరేషన్, లైటింగ్ లాంటి కార్యక్రమాలు చేసినందుకుగానూ రూ.4.20 లక్షలు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చెల్లించాల్సి ఉంది. నగదుకు సంబంధించిన బిల్లులు ఇటీవల నరేంద్రవర్మ పీఏకు అందజేశాడు. మూడు రోజుల కిందట వర్మ పీఏ ఫోన్ చేసి సార్ అమౌంట్ ఇచ్చేందుకు పార్టీ కార్యాలయానికి రమ్మంటున్నారని చెప్పడంతో పార్టీ కార్యాలయానికి వెళ్లాడు.
వర్మతో మాట్లాడుతుండగా ఆయన తనయుడు రాకేష్‌వర్మ వచ్చి ఇష్టానుసారంగా బూతులు తిడుతూ దాడిచేశారు. ఇదేమని అడిగితే తండ్రి నరేంద్రవర్మ, తనయుడు రాకేష్‌వర్మలు ఇరువురు నోరెత్తావంటే చంపేస్తాం అంటూ బెదరించారు. ఏంచేయాలో తెలియక పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ యు శ్రీనివాసులు వేగేశన నరేంద్రవర్మ, అతని కుమారుడు రాకేష్‌వర్మలపై హత్యాయత్నం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment