అలా నమ్మించాడు.. ఇలా ఉడాయించాడు.. కోటి రూపాయ‌ల‌తో ప‌రార్‌ | - | Sakshi
Sakshi News home page

అలా నమ్మించాడు.. ఇలా ఉడాయించాడు.. కోటి రూపాయ‌ల‌తో ప‌రార్‌

Published Sat, Jan 13 2024 1:40 AM | Last Updated on Sat, Jan 13 2024 11:15 AM

చీటీ పాటలకు డబ్బులు ఇచ్చి మోసపోయిన ముస్లిం కాలనీవాసులు   - Sakshi

చీటీ పాటలకు డబ్బులు ఇచ్చి మోసపోయిన ముస్లిం కాలనీవాసులు

రోజుకో కొత్త మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని కాజేస్తే ఆ బాధ వర్ణణాతీతం. ఇంతా జరుగుతున్నా కూడా ప్రజల్లో అవగాహన రాకపోవడం శోచనీయం. అలవల పాడు గ్రామంలో షేక్‌ మస్తాన్‌వలి బాగా నమ్మకం ఏర్పరుచుకున్నాడు. 10 ఏళ్లుగా చీటీ పాటలు కట్టిస్తూ, అవసరమైన వారికి డబ్బులు సాయం చేస్తూ అందరిలో కలిసి పోయాడు. రూ. 50 వేల చీటీ పాటల నుంచి రూ. 2 లక్షల చీటీ వరకు వేసేవాడు. అతడ్ని నమ్మి గ్రామంలో చాలా మంది చీటీలు కట్టారు. బంగారం వ్యాపారం చేస్తున్నానంటూ నమ్మ బలికి లక్షలాది రూపాయలు అప్పులు చేశాడు. వారిలో కొంత మందికి 2,3 నెలల పాటు వడ్డీలు చెల్లించాడు. అది చూసి చాలా మంది ఆశపడి డబ్బులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దీన్ని ఆసరాగా తీసుకొని నెల రోజుల నుంచి గ్రామంలో కనిపించకుండా వెళ్లిపోయాడు.

జే.పంగులూరు: మండల పరిధిలోని అలవలపాడు గ్రామానికి చెందిన షేక్‌ మస్తాన్‌వలి గ్రామంలో చీటీ పాటలు నిర్వహిస్తుంటాడు. అతడ్ని నమ్మి 160 మంది వరకు నెలకు రూ. 10 వేలు చొప్పున చీటీ కట్టారు. అందరూ ముస్లిం కాలనీకి చెందిన వారు. చీటీ పాటలు కట్టిన వారంతా కూలీనాలీ చేసుకునే వారే. చీటీ కట్టేవారిలో కొందరు పిల్లల చదువు కోసం, కొందరు కూతురు పెళ్లి నిమిత్తం కట్టినవారు ఉన్నారు. ఇలా ఎంతోమంది కష్టపడి డబ్బులు కట్టుకున్నారు. వారిలో అతి కొద్ది మందికి మాత్రమే తిరిగి అందాయి. ఎనిమిది చీటీ పాటల్లోనూ కొందరికి మాత్రమే డబ్బులు చెల్లించాడు. తప్పుడు చీటీ పాటలు చూపి డబ్బులు మొత్తం అతనే వాడుకున్నాడని బాధితులు వాపోతున్నారు.

రూ. 50 లక్షలు వరకు అప్పులు
చీటీ పాటలే కాక గ్రామంలో కొంత మందికి దొంగ బంగారం కొంటున్నానని షేక్‌ మస్తాన్‌వలి నమ్మబలికించి రూ. 50 లక్షలు వరకు అప్పులు చేశాడు. వారిలో కొంత మందికి నెలనెలావడ్డీ డబ్బులు చెల్లించాడు. అలవలపాడు గ్రామంలో గతంలో కొంత మంది దొంగ బంగారం వ్యాపారం చేసి కోట్లాది రూపాయలు గడించారన్న నానుడి ఉంది. బొంబాయి నుంచి బంగారం కొంటున్నానని, డబ్బులు తగ్గాయని గ్రామంలో ఉన్న కొంత మంది వద్ద అప్పులు చేశాడు. మరికొంత మంది అతడ్ని నమ్మి డబ్బులు ఇచ్చారు. కొంత మంది ఇల్లు, పొలం తనఖా పెట్టి లక్షలు లక్షలు తెచ్చి షేక్‌ మస్తాన్‌వలి చేతిలో పోశారు. గ్రామానికి చెందిన డోలా గోవిందమ్మ అనే వృద్ధురాలు రూ. 13 లక్షలు తెచ్చి ఇచ్చింది. వాటిలో రూ.8 లక్షలు బ్యాంకు నుంచి లోను తీసుకోగా, ఇల్లు కట్టుకోవాలని రూ.5 లక్షలు దాచుకుంది. మొత్తం తెచ్చి మస్తాన్‌వలి చేతిలో పెట్టింది. పారిపోయాడన్న విషయం తెలుసుకున్న గోవిందమ్మ భోరున విలపించింది. ఇలా మస్తాన్‌వలి మోసాలకు బలైన వారు ఎందరో ఉన్నారు.

నమ్మి రూ. 6 లక్షలు ఇచ్చా
మా కాలనీలో అంతా షేక్‌ మస్తాన్‌వలిని పూర్తిగా నమ్మాం. అందరితో పాటు నేను నమ్మి అతని వద్ద రూ. 2 లక్షల చీటి పాటలు రెండు వేశా. రెండు పాటలు చివరికి వచ్చాయి. అదీ కాక బంగారం కొంటానని చెప్తే మరో రూ. 6 లక్షలు ఇచ్చా. వాటికి సంబంధించి నాకు మూడు నెలలు పాటు వడ్డీ చెల్లించాడు. అది చూసి కొంత మంది అతనికి డబ్బులు ఇచ్చారు. నాకు రెండు నెలల నుంచి వడ్డీ డబ్బులు ఇవ్వడం లేదు.
–షేక్‌ నన్నేసా, బాధితుడు

రూ. 5.50 లక్షల చీటీ పాటలు కట్టా
షేక్‌ మస్తాన్‌ వలి గ్రామంలో బాగా నమ్మకం ఏర్పచుకున్నాడు. గత 10 సంవత్సరాల నుంచి చీటీలు వేస్తున్నాడు. అది నమ్మి మేము కొంతమంది కలిసి లక్షలాది రూపాయలు కట్టాం. నేను మూడు పాటలకు గాను ఇప్పటికి రూ. 5.50 లక్షలు చెల్లించాను. పాటలు చివరికి వచ్చాయి. గత నెల 20వ తేదీన డబ్బులు ఇస్తాన్నాడు. చివరికి గ్రామంలోనే లేకుండా పరారయ్యాడు.
–షేక్‌ సైదా, బాధితుడు

రూ. 9.50 లక్షలు మోసపోయా
మస్తాన్‌ వలిని నమ్మి ఎలాంటి నోటు లేకుండా నోటి మాట మీద గత నెల 5న రూ. 9.50 లక్షలు ఇచ్చాను. నేను డబ్బులు ఇచ్చిన తరువాత రెండు రోజులకు గ్రామం వదిలి కుటుంబ సభ్యులతో వెళ్లిపోయాడు. ఫోన్‌ చేస్తే ఫోన్‌ కలవలేదు. దానితో పాటు రూ. 1.50 లక్షల చీటీ పాట డబ్బులు కట్టా. అవి కూడా నాకు ఇవ్వలేదు.
– షేక్‌ దస్తగిరి, అలవలపాడు, బాధితుడు

అలా నమ్మించాడు.. ఇలా ఉడాయించాడు రూ.1 కోటి చీటీ పాట డబ్బులతో పరార్‌ 160 మంది వరకు బాధితులు బంగారం కొనుగోలు పేరుతో బురిడీ కుటుంబ సభ్యులతో పరారైన షేక్‌ మస్తాన్‌వలి

No comments yet. Be the first to comment!
Add a comment
 షేక్‌ మస్తాన్‌వలి రాసిన నోటు 1
1/2

షేక్‌ మస్తాన్‌వలి రాసిన నోటు

షేక్‌ మస్తాన్‌వలి2
2/2

షేక్‌ మస్తాన్‌వలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement