ఖమ్మంఅర్బన్: ఎంత డబ్బు ఉన్నా వెంట రాదనే విషయాన్ని గుర్తించి నలుగురికి సాయపడే ననులు చేయాలని తద్వారా మంచి పేరు లభిస్తుందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండి పార్థసారధిరెడ్డి పేర్కొన్నారు. అలాగే, పిల్లలను చదివిస్తూనే సమాజసేవ వైపు పయనించేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఖమ్మంలో ఆదివారం జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన ఆత్మీయ సన్మానసభలో ఎంపీ మాట్లాడారు.
పిల్లలకు ఆస్తులు కంటే విజ్ఞానం అందించి స్వతహాగా జీవించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. పార్లమెంట్ సభ్యుల వ్యక్తిగత ఖర్చుల కోసం కేంద్రప్రభుత్వం పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తుండగా, ఆర్థిక స్తోమత ఉన్న సభ్యులు తిరస్కరించే అవకాశమున్నా శ్రీమంతులు సైతం స్వీకరిస్తున్నారని తెలిపారు. కానీ తాను మాత్రం ప్రభుత్వ సొమ్ము పైసా తీసుకోకుండా ప్రజాసేవ చేసేందుకే రాజ్యసభ సభ్యత్వం స్వీకరించినట్లు చెప్పారు. ఈమేరకు సదుపాయాలు, రవాణా చార్జీలు, వసతి సౌకర్యం కోసం కేంద్రం ఇచ్చే నిధులను పీఎం సహాయనిధికి, రాష్ట్రం నుండి వచ్చే వాటిని సీఎం సహాయనిధికి ఇచ్చేలా నిర్ణయించినట్లు తెలిపారు.
కులమేదైనా మంచిని స్వీకరించి, నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు. రెడ్డి సంక్షేమ సంఘం విజ్ఞప్తి మేరకు ఖమ్మంలో రెడ్డి సంక్షేమ భవన్ నిర్మాణానికి రూ.కోటి విరాళంగా ఇస్తున్నట్లు ఎంపీ ప్రకటించారు. అనంతరం రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు ఎంపీ పార్థసారధిరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మొగిలి శ్రీనివాసరెడ్డితో పాటు శీలం వెంకట్‌రెడ్డి, ఐలూరి వెంకటేశ్వర్‌రెడ్డి, నూకల నరేష్‌రెడ్డి, వంగ సాంబశివారెడ్డి, మంజునాథరెడ్డి, మద్ది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment