విద్యుత్ శాఖలో ఎమర్జెన్సీ బృందాలు
● ఆరుగురు చొప్పున ఐదు బృందాల ఏర్పాటు ● జీపీఆర్‌ఎస్ లొకేషన్ ఆధారంగా పయనం, సమస్యల పరిష్కారం
ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ సంబంధించి సేవలను యుద్ధ ప్రాతిపదికన అందించేలా ఎమర్జెన్సీ రిస్టోర్ టీం(ఈఆర్‌టీ)లను ఏర్పాటు చేస్తున్నారు. వేసవిలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తరచుగా విద్యుత్ సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి సమస్యలను గుర్తించి సత్వరమే పరిష్కరించేలా ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆదేశాలతో ప్రత్యేక బృందాలను నియమిస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు ఐదు వాహనాలను కేటాయించారు. ఈ వాహనాల ఆధారంగా ఖమ్మం సర్కిల్‌లో ఐదు ఈఆర్‌టీలను ఏర్పాటు చేసి సేవలను ప్రారంభించారు. ఖమ్మం సర్కిల్‌లో ఖమ్మం టౌన్, ఖమ్మం రూరల్, వైరా, సత్తుపల్లి విద్యుత్ డివిజన్లు ఉన్నాయి. ఇందులో ఖమ్మం, వైరా డివిజన్లలో ఐదు బృందాలను నియమించారు.
సమాచారం అందగానే...
ఎక్కడైనా విద్యుత్ సంబంధిత సమస్య ఎదురైనట్లు స్థానికులు ఫిర్యాదు చేసినా లేదా ట్రోల్ ఫ్రీ నంబర్ 1912 ద్వారా సమాచారం అందినా ఈఆర్‌టీ బృందం వెంటనే రంగంలోకి దిగుతుంది. ఈ సేవలకు జీపీఆర్‌ఎస్‌ను వినియోగించుకుంటున్నారు. స్థానికులు, విద్యుత్ సిబ్బంది సమస్య ఉన్న ప్రాంతం జీపీఆర్‌ఎస్ లొకేషన్ పెడితే ఈఆర్‌టీలు వాహనంలో బయలుదేరతారు. ఈ యాన వాహనంలో థర్మో విజన్ కెమెరాలు, రంపాలు, టార్చ్‌లైట్లు, నిచ్చెనలు, ఇన్సులేటర్లు, కండక్టర్లు, కేబుల్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ప్రస్తుతం ఈ సేవలను ఎన్పీడీసీఎల్ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించినా 24గంటల అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. కాగా, సర్కిల్ పరిధిలో వేసవి ప్రణాళికలో భాగంగా మరిన్ని ఈఆర్‌టీలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది.
సత్వర సేవల కోసం...
వినియోగదారులకు అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా ఈఆర్‌టీలను ఏర్పాటు చేశాం. ఈ బృందాలకు అవసరమైన వాహనాలు, సామగ్రిని సమకూర్చాం. సాంకేతిక పరిజ్ఞాం ద్వారా సమస్య ఎదురైన ప్రాంతాన్ని గుర్తించి ఆయా బృందాలు చేరుకుంటాయి.
– ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్‌ఈ
విద్యుత్ శాఖలో ఎమర్జెన్సీ బృందాలు
Comments
Please login to add a commentAdd a comment