కీటక జనిత వ్యాధులపై అవగాహన
దుమ్ముగూడెం : కీటక జనిత వ్యాధులపై వైద్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగయ్య బృందం అవగాహన కల్పించింది. మండలంలోని పర్ణశాల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మలేరియా–ఫైలేరియా బృందం గురువారం సందర్శించింది. వైద్యాధికారి, సిబ్బందితో మలేరియా, డెంగీ కేసులపై బృందం సభ్యులు చర్చించారు. రక్త పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం మలేరియా కేసు నమోదైన పులిగుండాల గ్రామాన్ని సందర్శించారు. బాధితుడి ఇంటికి వెళ్లి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. కీటక జనిత వ్యాధులపై అవగాహన కల్పించి నీటి నిల్వలు లేకుండా చూడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అందరూ దోమతెరలు కట్టుకోవాలని చెప్పారు. వైద్యాధికారులు కుమార్ స్వామి, రేణుకారెడ్డి, ధర్మారావు, రామకృష్ణ, నాగేశ్వరరావు, మురళి, సురేష్ పాల్గొన్నారు.
ఎస్‌బీఐ మేనేజర్‌కు
రాష్ట్రస్థాయి అవార్డు
ములకలపల్లి: మండల పరిధిలోని ఎస్‌బీఐ పూసుగూడెం శాఖ మేనేజర్ బి.రాజేంద్రనాయక్‌కు రాష్ట్రస్థాయి అవార్డు దక్కింది. ఉత్తమ బ్యాంకింగ్‌తోపాటు ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్‌కు గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీజీఎం రాజేశ్‌కుమార్ అవార్డు అందజేశారు.
డీర్ పార్కు మహిళా వాచర్‌పై దాడి
పాల్వంచరూరల్: ఇంట్లో ఉన్న కిన్నెరసాని డీర్ పార్కులో వాచర్‌గా పనిచేస్తున్న మహిళపై దాడి ఘటనలో గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని కిన్నెరసాని గ్రామానికి చెందిన గుంటుపల్లి జ్యోతి ఈ నెల 14న తన ఇంట్లో ఉండగా అదే గ్రామానికి చెందిన సీహెచ్.శివ వచ్చి గొడవ పడి దాడి చేశాడు. గాయపరిచి, అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.
చీటింగ్ కేసు నమోదు
మణుగూరు టౌన్: పట్టణంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేసే వ్యక్తి వసూలు చేసిన రూ.90వేల నగదుతో ఉడాయించాడు. గురువారం బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు చేయగా మణుగూరు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రిమాండ్ ఖైదీ మృతి
భద్రాచలంఅర్బన్: గంజాయి కేసులో పట్టుబడిన భద్రాచలం పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీకి చెందిన ధనసరి మల్లేష్ అలియాస్ పోడియం మల్లేష్‌ను 2021లో రిమాండ్ నిమిత్తం ఖమ్మం జైలుకు తరలించారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు తీసుకెళ్లారు. ఈ ఏడాది జనవరి 22న అతని ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడంతో గాంధీ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఈ నెల 19న మృతి చెందాడు. బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే 70958 88604నంబర్‌లో 24 గంటల లోపు సంప్రదించాలని చంచల్‌గూడ జైలర్ ఒక ప్రకటనలో తెలిపారు.
నాలుగు టన్నుల చేపలు మృతి
పాల్వంచరూరల్: చేపలు పట్టకుండా అడ్డుకోవడంతో నాలుగు టన్నుల చేపలు మృతిచెందాయని బాధితుడు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు పన్నాల శ్రీనివాసరెడ్డి కథనం ప్రకారం.. మండల పరిధిలోని రెడ్డిగూడెం గ్రామ శివారులో అన్ని అనుమతులతో చెరువు నిర్మించి చేపలు పెంచుకుంటున్నాడు. ఈ నెల 18న చేపలు పడుతుంటే పన్నాల చంద్రశేఖర్‌రెడ్డి, శరత్ చంద్రారెడ్డి తమ అనుచరులు 15మందితో కలిసి వచ్చి చేపలు పట్టకుండా అడ్డుకున్నారు. చేపల లారీని కూడా అడ్డుకుని చంపుతామని బెదిరించారు. దీంతో రూ.2.80 లక్షల విలువైన నాలుగు టన్నుల చేపలు మృతిచెందాయని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పన్నాల శ్రీనివాసరెడ్డి తెలిపాడు.
పశువులు స్వాధీనం
పాల్వంచ: అక్రమంగా లారీలో తరలిస్తున్న పశువులను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. బూర్గంపాడు నుంచి హైదరాబాద్‌కు లారీలో తరలిస్తుండగా ఎస్‌ఐ సుమన్ ఆధ్వర్యంలో నవభారత్ సమీపంలో పట్టుకున్నారు. 36 పశువులను స్వాధీనం చేసుకుని అన్నపూర్ణ గోశాలకు తరలించారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు.
కీటక జనిత వ్యాధులపై అవగాహన
Comments
Please login to add a commentAdd a comment