
‘ఐటీసీ’ పోరు నేడే..
● గుర్తింపు సంఘం ఎన్నికలకు ట్రేడ్ యూనియన్లు సిద్ధం ● కార్మికుల ఓట్ల కోసం భారీ నజరానాలు
బూర్గంపాడు: సారపాకలోని ఐటీసీ పీఎస్‌పీడీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. ఈ ఎన్నికలను అన్ని ట్రేడ్ యూనియన్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గత 50 రోజులుగా ప్రచారాన్ని హోరెత్తించగా ఈ పర్వానికి బుధవారం రాత్రి తెరపడింది. అనంతరం ప్రలోభాలతో ఓటర్లకు ఎర వేస్తున్నాయి. ఐటీసీ యాజమాన్యంతో 14వ వేతన ఒప్పందం చేసుకునేందుకు ఈ ఎన్నికల్లో గెలిచిన గుర్తింపు కార్మిక సంఘానికే అవకాశం ఉండనున్న నేపథ్యంలో గెలుపు కోసం శక్తికొద్దీ ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా టీఎన్‌టీయూసీ, ఐఎన్‌టీయూసీ, బీఆర్‌టీయూ సంఘాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాగా, బీఆర్‌టీయూకు సీఐటీయూ, ఐఈయూ యూనియన్‌లు మద్దతిస్తున్నాయి.
ప్రలోభాలకు ఎర..
ప్రచారపర్వం ముగిసినప్పటి నుంచి విందు, మందుతో కార్మికులను ప్రలోభపెడుతున్న ఆయా సంఘాల నేతలు.. గురువారం నగదు పంపిణీకి తెరలేపారు. ముఖ్యంగా న్యూట్రల్‌గా ఉన్న ఓటర్లకు ఈ మూడు యూనియన్లూ శక్తిమేర నగదు, నజరానాలు అందిస్తున్నాయి. ఒక్కో ఓటుకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అందిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కార్మిక శాఖ, ఐటీసీ యాజమాన్యం సంయుక్తంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఐటీసీ పరిసర ప్రాంతాల్లో పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటింగ్ నిర్వహించి సాయంత్రం ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు. ఆ తర్వాత కూడా గొడవలు జరగకుండా ఐటీసీ, పరిసర గ్రామాల్లో పోలీసులు తగు నిబంధనలు విధించారు.
Comments
Please login to add a commentAdd a comment