‘పది’ పరీక్షలకు సిద్ధం
● జిల్లాలో 73 కేంద్రాలు, హాజరుకానున్న 12,282 మంది.. ● విద్యార్థులకు ఐదు నిమిషాల వెసులుబాటు ● పోలీస్‌స్టేషన్లకు చేరిన ప్రశ్నపత్రాలు
జిల్లాలోని పాఠశాలలు, విద్యార్థుల వివరాలిలా..
మేనేజ్‌మెంట్ స్కూళ్లు బాలురు బాలికలు మొత్తం
ప్రభుత్వ 13 279 209 488
స్థానిక సంస్థలు 97 1731 1511 3242
ఎయిడెడ్ 09 163 309 472
గిరిజన సంక్షేమ 51 1077 1321 2398
టీఎస్‌ఎంఆర్‌ఎస్ 08 114 112 226
టీఎస్‌టీడబ్ల్యూఆర్‌ఎస్ 11 380 457 837
కేజీబీవీ 14 00 519 519
ఎంజేపీటీ 11 297 293 590
ప్రైవేట్ 126 1948 1562 3510
కొత్తగూడెంఅర్బన్ : జిల్లాలో ఈనెల 21 నుంచి జరుగనున్న పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. గత వారం రోజులుగా ఎంఈఓలు, హెచ్‌ఎంలతో వీడియో, టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు, సౌకర్యాలపై ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని 73 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనుండగా గురువారమే తరగతి గదుల్లో హాల్‌టికెట్ నంబర్లు వేయనున్నారు. వారం రోజుల క్రితమే ప్రశ్నపత్రాలు కేంద్రాల సమీప పోలీస్ స్టేషన్లకు చేరుకున్నాయి. ఎండల నేపథ్యంలో విద్యార్థులకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఎదురైతే చికిత్స చేసేందుకు పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. పరీక్షల సమయానికి అనుగుణంగా బస్సులు నడిపించాలని ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ఫ్యాన్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
రేపటి నుంచి ఏప్రిల్ 4 వరకు..
పదో తరగతి పరీక్షలు ఈనెల 21 నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు జరుగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12. 30 వరకు పరీక్షలు జరుగనుండగా 9.35 నిమిషాల వరకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. అయితే గంట ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో 73 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 12,282 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు 73 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, ఐదుగురు ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఏడుగురు రూట్ అధికారులు, 73 మంది డిపార్టుమెంటల్ అధికారులు, 26 మంది సెంటర్ కస్టోడియన్లు, 73 మంది సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాల రవాణా, పరీక్ష అనంతరం సమాధానపత్రాల బండిళ్లను పోస్టాఫీసులకు చేరవేసేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పరిసర ప్రాంతాల్లో 163 సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్ష సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
విద్యార్థులు సకాలంలో చేరుకోవాలి
విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలి. పరీక్ష 9.30 గంటలకు ప్రారంభం కానుండగా ఆ తర్వాత ఐదు నిమిషాల వరకు కూడా అనుమతిస్తాం. పరీక్ష సమయంలో ఆర్టీసీ అధికారులు నడిపే బస్సులను సద్వినియోగం చేసుకోవాలి. పరీక్ష కేంద్రాల్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.
– వెంటేశ్వరాచారి, డీఈఓ
‘పది’ పరీక్షలకు సిద్ధం