స్వర్ణకవచాలంకరణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచధారులై భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేం చేశారు. అమ్మవారి జన్మస్థలం వద్ద పసుపు, కుంకుమ, గాజులు, చీర, సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కుంకుమపూజ, గణపతి హోమం నిర్వహించిన అర్చకులు నివేదన, పంచహారతులు సమర్పించారు. ఆ తర్వాత నీరాజన మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్, ఎస్పీని కలిసిన సింగరేణి డైరెక్టర్లు
సింగరేణి(కొత్తగూడెం) : కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజును సింగరేణి డైరెక్టర్లు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. డైరెక్టర్(పీపీ అండ్ పా) కె.వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ వారిని పుష్పగుచ్ఛాలు అందించారు. కార్యక్రమంలో జీఎంలు ఎన్.రాధాకృష్ణ, చందా లక్ష్మీనారాయణ, ఎస్‌ఓటుజీఎం వేణుమాదవ్, తావురియా, డి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఉన్నత
లక్ష్యాలు ఏర్పర్చుకోవాలి
సుజాతనగర్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పర్చుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి అన్నారు. మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో శుక్రవారం జరిగిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. ఉన్నత లక్ష్యాలతోనే మంచి భవిష్యత్ ఏర్పడుతుందన్నారు. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. అంతకుముందు హాస్టల్‌లో అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బ్యూలారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
స్వర్ణకవచాలంకరణలో రామయ్య