భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి నిత్యకల్యాణ వేడుక ఆదివారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.
శ్రీ సీతారామచంద్రస్వామి వారికి
గోటి తలంబ్రాల సమర్పణ
భద్రాచలంటౌన్: భద్రాచలం రామాలయంలో జరిగే స్వామివారి కల్యాణంలో వినియోగించే తలంబ్రాలను భక్తులు ఆదివారం సమర్పించారు. భూపాలపల్లి జిల్లా చెల్పూర్ గ్రామానికి చెందిన భక్త రామదాసు భక్త మండలి సభ్యులు స్వామివారి ప్రత్యేక పండించిన కోటి వరి ధాన్యం గింజలను భక్తి శ్రద్ధలతో గోటితో ఒలిచి ఆలయానికి తీసుకొచ్చి అప్పగించారు. వీరు ఎనిమిదేళ్లుగా తలంబ్రాలు అందజేస్తున్నారు. ఆలయ పీఆర్వో సాయిబాబా, భక్త మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రామాలయంలో
రంగారెడ్డి ఎస్పీ పూజలు
భద్రాచలంటౌన్: శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానాన్ని రంగారెడ్డి ఎస్పీ పరితోష పంకజ్ ఆదివారం కుటుంబ సమేతంగా సందర్శించారు. అంతరాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు ఎస్పీకి స్వామివారి జ్ఞాపికతో పాటు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ రమేష్, ఎస్‌ఐ మధు ప్రసాద్, ఆలయ పీఆర్వో సాయిబాబా, వేద పండితులు పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి విశేషపూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో అర్చకులు, ఈఓ ఎన్.రజనీకుమారి పాల్గొన్నారు.
నేడు ప్రజావాణి
సూపర్‌బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందజేయాలని కోరారు.
ఆలయానికి
రూ.1.20 లక్షల విరాళం
జూలూరుపాడు: పాపకొల్లు శ్రీ ఉమాసోమలింగేశ్వర ఆలయ అభివృద్ధి, మరమ్మతులకు గ్రామానికి చెందిన బండ్ల వెంకటరామ రఘు, శ్రీదేవీ దంపతులు రూ.1.20 లక్షలను ఆదివారం విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పూసాల శ్రీనివాసాచారి, బండ్ల మధుసూదన్‌రావు, నిమ్మటూరి కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా రామయ్య నిత్యకల్యాణం
ఘనంగా రామయ్య నిత్యకల్యాణం