టేకులపల్లి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు వంట పాత్రలు మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, గిరిజన పాఠశాలలకు మధ్యాహ్న భోజన వంట పాత్రలను పంపిణీ చేసింది. బుధవారం టేకులపల్లి మండలంలోని 68 పాఠశాలలకు ఎంఈఓ కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారి జగన్ హెచ్‌ఎంలకు, ఉపాధ్యాయులకు వంట పాత్రలను అప్పగించారు. వంట పాత్రలు తీసుకెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు, సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడంతో ఉపాధ్యాయులే తీసుకెళ్లాల్సి వచ్చింది. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులను కూడా తీసుకొచ్చి వంట పాత్రలు మోయించారు. కాగా వంట పాత్రలను తరలించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేస్తే బాగుండేదని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పాఠశాల సమయంలో ఉపాధ్యాయులను పిలిచి వంటపాత్రలు అప్పగించడం సరికాదని యూటీఎఫ్ జిల్లా నాయకుడు కిషోర్ సింగ్ పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల వంట పాత్రలను వారే మోసుకెళ్లిన వైనం
ఉపాధ్యాయులు, విద్యార్థులే కూలీలా..?