
మితిమీరితే మోతే..!
భద్రాచలంఅర్బన్: ఎండలు మండుతున్న నేపథ్యాన ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండతాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లను అధికంగా వాడుతుండడంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుండగా.. జీరో బిల్ కోసం పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు. కాగా, వేసవి దృష్ట్యా 200 యూనిట్లు దాటితే బిల్లు మరింత అదనపు భారం కానుందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
4,57,216 కనెక్షన్లు.. రూ.13.69 కోట్ల బిల్లులు
జిల్లా వ్యాప్తంగా 4,57,216 కనెక్షన్లు ఉండగా.. ప్రభుత్వం నెలకు సుమారు రూ.5.12 కోట్లు, అదే ఏడాదికి సుమారు రూ.67.88 కోట్ల బిల్లులు చెల్లిస్తోంది. వీటిలో వ్యవసాయం, కంపెనీలు, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాల బిల్లులు వస్తున్నప్పటికీ గృహజ్యోతి బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తోంది.
1,64,080 మందికి లబ్ధి..
జిల్లా వ్యాప్తంగా గృహ విద్యుత్ వినియోగదారులు 1,68,003 ఉండగా.. ప్రభుత్వం జీరో బిల్ అమలు చేసిన నాటి నుంచి 1,64,080 మందికి లబ్ధి చేకూరుతోంది. ఇప్పటికే ఎండలు దంచికొడుతుండగా.. రానున్న రెండు నెలల్లో విద్యుత్ వినియోగం పెరగడం ఖాయం కాగా కొందరికకే జీరో బిల్ వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. విద్యుత్‌ను పొదుపుగా వాడుకుంటే తప్పా.. 200 యూనిట్లు దాటిన వారంతా విద్యుత్ బిల్లు చెల్లించాల్సిందేనని అధికారులు తేల్చి చెబుతున్నారు.
3,923 మంది పథకానికి దూరం..
జిల్లా వ్యాప్తంగా 1,64,080 మంది పథకానికి అర్హులు కాగా గడిచిన ఫిబ్రవరికి సంబంధించిన విద్యుత్‌ను మార్చిలో మీటరు రీడింగ్ తీయగా.. 3,923 మంది గృహజ్యోతి పథకానికి దూరమయ్యారు. దీంతో వారు ఫిబ్రవరి బిల్లంతా చెల్లించాల్సి వస్తోంది. రానున్న రెండు నెలల్లో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. గతేడాది మార్చిలో 4,942 మంది, ఏప్రిల్‌లో 10,119 మంది, మేలో 16,036 మంది లబ్ధిదారులు పథకానికి దూరమై జూన్ తర్వాత నుంచి మళ్లీ పథకం లబ్ధి పొందారు.
ఒక్క యూనిట్ మించినా..
ఉచిత విద్యుత్ 200 యూనిట్లకే పరిమితం. ఒక్క యూనిట్ దాటినా యూనిట్‌కు రూ.5.10 చొప్పున బిల్లు పడుతుంది. 201 యూనిట్లు నమోదైతే ఇతర చార్జీలతో కలిపి కనీస బిల్లు రూ.1,050 చెల్లించాల్సి ఉంటుంది.
పొదుపుగా వాడుకోవాలి..
వేసవిలో ప్రతీ వినియోగదారుడు విద్యుత్‌ను పాదుపుగా వాడుకోవాలి. ప్రభుత్వం 200 యూనిట్ల వరకే ఉచిత విద్యుత్ అందిస్తుండగా.. అవసరాల మేరకే వాడుకోవాలి. లేదంటే ఒక్కయూనిట్ దాటినా బిల్లు మొత్తం కట్టాల్సిందే. వృథాను అరికట్టి సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి.
– మహేందర్, ఎస్‌ఈ, విద్యుత్ శాఖ
జీరో బిల్లు అందిస్తున్నాం..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జీరో బిల్లు అమలు చేస్తోంది. కంపెనీలు, ప్రభుత్వ భవనాలు, వ్యవసాయ బిల్లులు అధికారులు, రైతుల వద్ద వసూళ్లు చేస్తూ ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం. విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం.
– జీవన్‌కుమార్, డీఈ, భద్రాచలం
బిల్లు భారాన్ని అధిగమించాలంటే..
● అవసరం మేరకే ఫ్యాన్లు, కూలర్లు వాడాలి.
● ఏ గదిలో ఉంటే ఆ గదిలోనే ఫ్యాన్లు, లైట్లు వినియోగించాలి.
● ఉక్కపోత అధికంగా ఉన్నప్పుడే కూలర్లు వాడాలి.
● నాణ్యతలేని కూలర్లు, ఫ్యాన్లతో అధిక విద్యుత్ వినియోగించడానికి ఆస్కారం ఉంది.
● ఉచిత విద్యుత్ అనే భావనతో నిర్లక్ష్యం చేస్తే బిల్లు మోత తప్పదు.
● ఎల్‌ఈడీ బల్బులు, ట్యూట్‌లైట్లు వాడాలి.
గత మూడు నెలల్లో
జిల్లావ్యాప్తంగా విద్యుత్ వినియోగం
నెల వినియోగం (మిలియన్ యూనిట్లలో)
ఫిబ్రవరి 151.45
మార్చి 175.03
ఏప్రిల్ 59.62
(ఇప్పటి వరకు)
వేసవిలో పెరగనున్న విద్యుత్ వినియోగం
200 యూనిట్లు దాటితే జీరో బిల్లుకు దూరం
జిల్లా వ్యాప్తంగా 1,64,080 మందికి పథకం వర్తింపు
లబ్ధిదారులూ బహుపరాక్

మితిమీరితే మోతే..!

మితిమీరితే మోతే..!