
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే కరువు భత్యాన్ని (డీఏ)ని కేంద్రం 4శాతం పెంచే అవకాశం ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ పెంపు తర్వాత డియర్ నెస్ అలవెన్స్, డియర్ నెస్ రిలీఫ్ (డీఆర్) 50 శాతానికి పైగా పెరగనుంది.
చివరి సారిగా 2023 అక్టోబర్ లో కేంద్రం డీఏని 4 శాతం పెంచింది. ఆ నాలుగు శాతం పెంపుతో డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి పెరిగింది. తాజా నిర్ణయంతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.
గతంలో పారామిలటరీ బలగాలతో సహా గ్రూప్ సి, నాన్ గెజిటెడ్ గ్రూప్ బి స్థాయి అధికారులకు దీపావళి బోనస్‌లను ప్రభుత్వం ఆమోదించింది. 2022–2023కి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్పాదకత లేని బోనస్‌ల (అడ్ హాక్ బోనస్‌లు) లెక్కింపు కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ.7,000 పరిమితిని నిర్ణయించింది .
దేశ ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా ప్రభుత్వం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటుంది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే, డీఏ మరింత పెరిగే అవకాశం ఉంది. డీఏ, డీఆర్ పెరుగుదలలు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) యొక్క 12 నెలల సగటు పెరుగుదల శాతం ద్వారా నిర్ణయించబడతాయి.
Comments
Please login to add a commentAdd a comment