
భువనేశ్వర్: రాష్ట్రానికి హైస్పీడ్ 5జీ ఇంటర్నెట్ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర సాంకేతిక, సమాచార శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పూరీ పర్యటన పురస్కరించుకుని ఆయన ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ శిక్షణా శిబిరం కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి విచ్చేశారు. కేంద్రప్రభుత్వం సంకల్పించిన 5జీ సేవలు తొలి దశలోనే రాష్ట్రానికి కల్పిస్తున్నట్లు ప్రకటించడం విశేషం.
దేశంలో పలు ప్రాంతాలకు ఈ సేవలు లభిస్తాయని, ఈ వ్యవస్థలో మానవాళికి ఎటువంటి ముప్పు ఉండబోదని హామీ ఇచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) జారీ చేసిన రేడియేషన్ పరిమితి కంటే సుమారు 10 రెట్లు తక్కువగా దేశంలో ప్రవేశ పెట్టనున్న హైస్పీడ్ ఇంటర్నెట్ వ్యవస్థ ఉంటుందని స్పష్టంచేశారు. వినియోగదారులకు విస్తృత 5జీ సేవలు కల్పించేందుకు అనుబంధ టెలికాం సంస్థలు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లతో సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అతి త్వరలో హైస్పీడ్ 5జీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి తొలి దశలో అవకాశం కల్పించే యోచన కనబరచడంపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment