న్యూఢిల్లీ: డిజిటల్ ఎకానమీకి మద్దతుగా శక్తివంతమైన నెట్‌వర్క్‌తో 5జీ సేవలను భారత్‌కు పరిచయం చేయడంలో కంపెనీ ముందంజలో ఉంటుందని భారతీ ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ తెలిపారు. అందరి కంటే ముందుగా భారత్‌లో 5జీ పరీక్షలను జరిపినట్టు ఎయిర్‌టెల్ 2021-22 వార్షిక నివేదికలో గుర్తు చేశారు.
’ధైర్యం, విశ్వాసంతో ముందుకు సాగండి’ అనే శీర్షికతో వాటాదార్లకు ఆయన సందేశం ఇచ్చారు. ‘రాబోయే కాలంలో అసెట్ లైట్ విధానాన్ని కొనసాగిస్తూనే డిజిటల్ సేవలు కంపెనీ ఆదాయానికి అనేక బిలియన్ డాలర్లను జోడిస్తాయి. ఎయిర్‌టెల్ డిజిటల్ ప్రయాణంలో అందించిన ప్రారంభ విజయాలు ఈ విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి. 5జీ క్లౌడ్ గేమింగ్ అనుభవాన్ని ప్రదర్శించిన తొలి భారతీయ టెలికం సంస్థగా నిలిచాం.
అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ కోసం 700 మెగాహెట్జ్ బ్యాండ్‌లో ట్రయల్స్ చేపట్టిన మొదటి ఆపరేటర్ పేరు తెచ్చుకున్నాం. కోవిడ్-19 కొత్త రకాలు, భౌగోళిక రాజకీయ సంక్షోభాలు, అంతకంతకూ పెరుగుతున్న వస్తువుల ధరలు, అధిక ద్రవ్యోల్బణం మధ్య 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రపంచ ఆర్థికవ్యవస్థలో భారత్ ఒక ప్రకాశ వంతమైన ప్రదేశంగా ఉద్భవించింది. మనమందరం ఒక పెద్ద ముందడుగు వేయడానికి సిద్ధం కావాలి. నూతన విశ్వాసంతో కొత్త మార్గంలో పనులు చేయడానికి ధైర్యం కలిగి ఉండాలి’ అని వార్షిక నివేదికలో వివరించారు. 5జీ స్పెక్ట్రమ్ వేలం కౌంట్‌డౌన్ మొదలైనందున సునీల్ మిట్టల్ వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించు కున్నాయి.
మొత్తం రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72 గిగాహెట్జ్ రేడియో తరంగాలను జూలై 26 నుంచి వేలం వేయనున్న సంగతి తెలిసిందే. జూలై 22, 23 తేదీల్లో టెలికం శాఖ మాక్ ఆక్షన్ నిర్వహిస్తోంది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతోపాటు అదానీ ఎంటర్‌ప్రైసెస్ సైతం వేలంలో పాల్గొంటున్నాయి.
ఇది కూడా చదవండి: రూపాయి: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment