ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తీరుపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. డెలివరీ ఎంప్లాయిస్ విషయంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న తీరు తాజాగా వెలుగు చూసింది. తుపానుల సమయంలోనూ డెలివరీలు చేయాలంటూ డెలివరీ పార్ట్‌నర్‌ను బెదిరించిన వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
అమెరికా ఇల్లినాయిస్‌లో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. భీకరమైన తుపాను నేపథ్యంలో హెచ్చరికలు జారీకాగా, అది కేవలం హెచ్చరికే కదా అంటూ డెలివరీ పార్ట్‌నర్‌కు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు అమెజాన్ ఎగ్జిక్యూటివ్స్. డెలివరీ కోసం వెళ్లాల్సిన ఓ యువతికి ఈ అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. తుపాను లేదు గిఫాను లేదు. అది కేవలం హెచ్చరిక మాత్రమే. ఆర్డర్లు డెలివరీ చేయకుండా వెనుదిరిగితే ఉద్యోగం ఊడుతుందని ఆ డెలివరీ గర్ల్‌ను అమెజాన్ ప్రతినిధులు బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ ఛాటింగ్‌కు సంబంధించి స్క్రీన్ షాట్లను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అమెజాన్‌పై పలువురు నెటిజన్స్ మండిపడుతున్నారు.
అంతేకాదు అమెజాన్‌లో డెలివరీ ఎంప్లాయిస్‌ల పట్ల మేనేజ్‌మెంట్ తీరు ఇలాగే ఉంటుందని, ప్రతికూల వాతావరణంలో తమ కోసం ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టరంటూ పలువురు ఆమెకు మద్దతుగా కామెంట్లు చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment