టెక్ దిగ్గజం గూగుల్ భారతీయ యువకుడికి నజరానా ప్రకటించింది. హ్యాకర్ల పాలిట కల్పతరువుగా మారిన ఓ బగ్‌ను కనిపెట్టిన కృషికి ఫలితంగా ఆ యువకుడికి క్యాష్ ప్రైజ్‌ను అందించింది.
అస్సాంకు చెందిన రోనీ దాస్ అనే యువకుడు.. గూగుల్ ఆండ్రాయిడ్ ఫోర్‌గ్రౌండ్ సర్వీసులో ఒక బగ్‌ను గుర్తించాడు. ఈ బగ్ సాయంతోనే హ్యాకర్లు యూజర్ల ఫోన్‌ను హ్యాక్ చేయడంతో పాటు వ్యక్తిగత డాటాను తస్కరించే అవకాశం ఉంది. ఈ బగ్‌ను రిపోర్టింగ్ చేసినందుకు గానూ 5 వేల డాలర్లను(మన కరెన్సీలో మూడున్నర లక్షల రూపాయలు) ప్రకటించింది గూగుల్.
దాస్ ఈ బగ్‌ను ఈ ఏడాది మే నెలలోనే గుర్తించాడు. ఈ కష్టానికి గుర్తింపుగా 5వేల డాలర్లు అందిస్తున్నాం అని గూగుల్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ టీం ఒక మెయిల్ ద్వారా దాస్‌కు తెలియజేసింది. దాస్ చెప్తున్న వివరాల ప్రకారం.. ఈ బగ్ ద్వారా ఫోన్ కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్..ఇలాంటి వివరాలు కూడా హ్యాకర్ల చేతికి వెళ్తాయట. అయితే గోప్యత కారణంగా బగ్‌కి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించేందుకు దాస్ ఇష్టపడలేదు.
సైబర్ అన్వేషణలో ఆసక్తి ఉన్న దాస్.. గతంలో గువాహటి యూనివర్సిటీ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనూ బగ్‌ను గుర్తించాడు. ఇక రోనీ దాస్ గుర్తించిన బగ్‌ను ఫిక్స్ చేసిందా? లేదా? అనే విషయంపై గూగుల్ స్పష్టత ఇవ్వలేదు. బగ్‌లను గుర్తించిన రీసెర్చర్లు, ఇంజినీర్లు, సైబర్ ఎక్స్‌పర్ట్స్‌లకు టెక్ దిగ్గజాలు నజరానా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఆసక్తి ఉంటే మీరూ ఆ దిశగా ప్రయత్నం చేసి అదృష్టం పరీక్షించుకోండి.
Comments
Please login to add a commentAdd a comment