న్యూఢిల్లీ: కొత్తగా ప్రవేశపెట్టబోయే ఐఫోన్ 14ని చైనాతో పాటు భారత్‌లోనూ దాదాపు ఏకకాలంలో తయారుచేయడంపై టెక్ దిగ్గజం యాపిల్ కసరత్తు చేస్తోంది. చైనాలో ఉత్పత్తి మొదలుపెట్టిన రెండు నెలలకే తర్వాత భారత్‌లోనూ తయారీ ప్రారంభించాలని భావిస్తోంది. దీంతో చైనాలో తయారయ్యే ఐఫోన్ 14 సెప్టెంబర్‌లో మార్కెట్లోకి రానుండగా.. మేడిన్ ఇండియా వెర్షన్ అక్టోబర్ ఆఖరు లేదా నవంబర్ నాటికి సిద్ధం కాగలదని భావిస్తున్నారు. సాధ్యమైనంత వరకూ దీపావళి పండుగ సీజన్‌ను పురస్కరించుకుని అక్టోబర్ 24కే ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణంగా చైనాలో ఉత్పత్తి చేసే ఐఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాక యాపిల్ ఆరు నుంచి తొమ్మిది నెలల తర్వాత భారత్‌లో తయారు చేస్తోంది.
అయితే, ఇటీవలి కాలంలో అమెరికా, చైనా ప్రభుత్వాల మధ్య విభేదాలు తలెత్తడం, కోవిడ్‌పరమైన లాక్‌డౌన్‌లతో సమస్యలు తలెత్తడం వంటి అంశాల వల్ల చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, ప్రత్యామ్నాయంగా భారత్‌లో తయారీ కార్యకలాపాలను పెంచుకోవడంపై యాపిల్ దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే రెండు దేశాల్లో తయారీ కార్యకలాపాల మధ్య జాప్యాన్ని గణనీయంగా తగ్గించుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ ఉంటున్న ఆరు నుంచి తొమ్మిది నెలల జాప్యాన్ని రెండు నెలలకు తగ్గించుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వివరించాయి. భారత్‌లో తయారీని వేగవంతం చేసేందుకు సరఫరాదారులతో కూడా కంపెనీ చర్చలు జరుపుతోంది.
ఏకకాలంలో ఉత్పత్తి..
భారత్‌లో యాపిల్ ఐఫోన్ల తయారీ 2017లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఫాక్స్‌కాన్, విస్ట్రన్, పెగాట్రాన్ సంస్థలు యాపిల్ కోసం ఐఫోన్ 13 ఫోన్లను దేశీయంగా తయారు చేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 47,000 కోట్ల విలువ చేసే ఐఫోన్లను భారత్ నుంచి ఎగుమతి చేయాలని యాపిల్ లక్ష్యంగా పెట్టుకుంది. భారత మార్కెట్లో యాపిల్ ఉత్పత్తుల విక్రయాలూ భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో యాపిల్ తమ ఉత్పత్తులను ఇరు దేశాల్లో (భారత్, చైనా) ఏకకాలంలో ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నాయని టీఎఫ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ గ్రూప్ వర్గాలు తెలిపాయి. తదుపరి ఐఫోన్ వెర్షన్ .. భారత్, చైనా నుంచి ఒకే సమయంలో రావచ్చని పేర్కొన్నాయి.
ఇందుకోసం చైనా నుంచి విడిభాగాలను ఎగుమతి చేయడం, భారత్‌లో వాటిని అసెంబ్లింగ్ చేయడానికి సంబంధించిన ప్రక్రియను ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది నుంచే రెండు దేశాల్లో ఉత్పత్తి ఏకకాలంలో ప్రారంభించాలని యాపిల్, ఫాక్స్‌కాన్ భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల రీత్యా సాధ్యపడకపోవచ్చని ఇరు కంపెనీలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, దీర్ఘకాలికంగానైనా ఈ ప్రణాళికను అమలు చేయాలని అవి భావిస్తున్నట్లు వివరించాయి. ఐఫోన్లను అసెంబ్లింగ్ చేయడమంటే చాలా కష్టతరమైన వ్యవహారమే. ఓవైపు వందలకొద్దీ సరఫరాదారులతో సమన్వయం చేసుకుంటూ మరోవైపు యాపిల్ విధించి కఠినతరమైన డెడ్‌లైన్లు, నాణ్యతా ప్రమాణాలను అందుకోవాల్సి ఉంటుంది. చైనాకు దీటుగా ఐఫోన్‌ల ఉత్పత్తిని సాధించగలిగితే భారత్‌కు పెద్ద మైలురాయిగా మారగలదు.
Comments
Please login to add a commentAdd a comment